ఏమిటి...కోలీవుడ్ ఖాళీ అయిపోతుందా?

February 14, 2018


img

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు కొత్త పార్టీలు పుట్టుకు రావడం సహజమే కానీ సినీ హీరోలు కూడా ఒకరి తరువాత మరొకరు రాజకీయ పార్టీలతో వచ్చేస్తుండటమే విచిత్రం. 

ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలోకి వస్తుంటే, అక్కడ తమిళనాడులో ఇద్దరు సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ వేర్వేరుగా పార్టీలతో వస్తున్నారు. వారితో బాటు మరో స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయ ప్రవేశానికి సన్నాహాలు చేసుకొంటున్నట్లు తాజా సమాచారం. అతను గత ఏడాది సెప్టెంబర్ లోనే తను స్థాపించబోయే పార్టీలో సభ్యులను చేర్చుకోవడం కోసం ఒక మొబైల్ యాప్ ప్రారంభించారని ‘అఖిల భారత విజయ్ ప్రజా సంఘం’ అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ తెలిపారు. ఒక్కో నియోజక వర్గంలో కనీసం 50,000 మందిని సభ్యులుగా చేర్చడం కోసం అప్పటి నుంచి తాము గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కొన్ని నెలలలోనే తమ పార్టీ నిర్మాణం పూర్తి చేసుకొని ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దం అవుతుందని బుస్సీ ఆనంద్ తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తుల గురించి చర్చిస్తున్నామని తెలిపారు. 

రజనీ, కమల్ ఇద్దరూ వేర్వేరు పార్టీలు పెట్టుకొని బరిలో దిగితే ఓట్లు చీలిపోతాయనుకొంటే, ఇప్పుడు విజయ్ కూడా సిద్దం అవుతున్నాడు. వారు ముగ్గురూ కాకుండా ఇప్పటికే మరో హీరో కెప్టెన్ విజయ్ కాంత్ చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నారు. ఈ సినీ హీరోలు కాక, ఇంతకాలం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను శాశిస్తున్న అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు వాటికి తోక పార్టీలుగా ఉండనే ఉన్నాయి. అవి కాక తమిళనాడు రాజకీయాలపై మంచి పట్టున్న శశికళ-దినకరన్ వర్గం కూడా ఉంది. కనుక ఇవన్నీ ప్రజల ఓట్లను చీల్చుకోవడం ఖాయం. ఆ కారణంగా హంగ్ ఏర్పడితే రాష్ట్రంలో రాజకీయ అనిస్థితి కొనసాగవచ్చు.


Related Post