డబుల్ క్రెడిట్ ఏ పార్టీది?

February 14, 2018


img

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్ళు మంజూరు చేసింది. ఆ పధకంలో భాగంగా పట్టణప్రాంతాలలో పేదలకు రాయితీపై ఇళ్ళు నిర్మించి ఇవ్వబడతాయి. అయితే వాటి కంటే మెరుగైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన బాగుండటంతో వాటిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో చేర్చడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించింది. కనుక రాష్ట్రంలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మిస్తున్నవని స్పష్టం అవుతోంది. కానీ మంత్రి కేటిఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు అది తమ ప్రభుత్వం పధకమన్నట్లు గట్టిగా నొక్కి చెప్పుకొంటున్నారు. అయినప్పటికీ రాష్ట్ర భాజపా నేతలు వారి మాటలను ఖండించే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. కనుక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పధకమేననే భావన ప్రజలలో కూడా నెలకొంది. తెరాస నేతలు, మంత్రులు ఆ భావనను ఇంకా పెంచి పోషిస్తూ ప్రజలను ఆకట్టుకొని రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అది సహజమే. కానీ ఇదంతా చూస్తూ కూడా రాష్ట్ర భాజపా నేతలు నోరు మెదపకపోవడమే విచిత్రం. 

కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కేంద్రం మంజూరు చేసిన 2 లక్షల ఇళ్ళ నిర్మాణ పనులు ఏవిధంగా సాగుతున్నాయో చూడాలనుకొన్నప్పుడు, నగరంలో వాటి నిర్మాణపనులు ఇంకా మొదలవలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారని, అది విని కేంద్రమంత్రి షాక్ తిన్నారని వార్తలు వచ్చాయి. నాలుగేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు నిర్మాణ పనులే ప్రారంభంకాకపోవడాన్ని అయన తప్పు పట్టినట్లు సమాచారం. 

ఆ తరువాతే భాజపా శాసనసభా నేత కిషన్ రెడ్డి కూడా స్పందించారు. “కేంద్రం మంజూరు చేసిన 2 లక్షల ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా ప్రచారం చేసుకొంటోంది. అయినప్పటికీ వాటిని ఇంతవరకు పూర్తి చేయలేకపోయింది. అసలు రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించిందో చెప్పాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస సర్కార్, వ్యవసాయ ఉత్పత్తులన్నిటినీ కేంద్రమే కొనుగోలు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తోందో చెప్పాలి. అన్నీ కేంద్రమే చేస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? విద్యార్ధుల కోసం కేంద్రం అందిస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేస్తూ విద్యార్ధులకు అన్యాయం చేస్తోంది. ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా తెరాస సర్కార్ తన మాట నిలబెట్టుకోలేదు,” అని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

కేంద్రం మంజూరు చేస్తున్న నిధులు, ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవడంలో రాష్ట్ర భాజపా నేతలు చాలా అలసత్వం లేదా ఉదాసీనత ప్రదర్శిస్తున్న కారణంగా ప్రజలలో వారి పట్ల, కేంద్రం పట్ల చులకనభావం ఏర్పడటం సహజం. అదే సమయంలో తెరాస నేతలు వాటిని తమవిగా ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. అందుకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళే ఒక ఉదాహరణగా కనబడుతున్నాయి. 

కానీ ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలిపినా ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు. కానీ వాటి పేరు చెప్పుకొని తెరాస నేతలు ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుండటం వారి రాజకీయ చతురతకు నిదర్శనం. కనుక రాష్ట్ర భాజపా నేతలు ఇప్పటికైనా మేలుకొని కేంద్ర పధకాల గురించి ప్రజలకు చెప్పుకొంటే మంచిది. లేకుంటే తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందనే తెరాస నేతల వాదనే నిజమని ప్రజలు కూడా నమ్మితే భాజపాకే నష్టం.


Related Post