కృతజ్ఞత సభలు అందుకేనా?

February 12, 2018


img

దేశంలో ఏ ప్రభుత్వమైన ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం, ఆ ప్రయత్నంలో భాగంగా పలు పధకాలు ప్రవేశపెట్టడం సర్వసాధారణమైన విషయమే. అది వాటి బాధ్యత కూడా. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. 

రాష్ట్రంలో గొల్ల, కురుమలకు జీవనోపాధి కల్పించేందుకు ఒక్కొక్క కుటుంబానికి రాయితీపై 21 గొర్రెలను అందజేస్తోంది. ఈ పధకంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 40 లక్షలకు పైగా గొర్రెల పంపిణీ జరిగినట్లు సమాచారం. గొల్ల, కురుమలలో అనేకమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవితాలలో వెలుగులు నింపుకొంటుంటే కొందరుమాత్రం దళారుల ప్రలోభాలకు తలొగ్గి తమకు ప్రభుత్వం అందించిన రాయితీ గొర్రెలను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఈ రాయితీ గొర్రెల పధకం అమలులో అనేక ఇబ్బందులు, కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో దానిని అమలుచేస్తున్న కారణంగా రాష్ట్రంలో నిత్యం అనేకమంది గొల్ల, కురుమలు లబ్ది పొందుతున్నారు. కనుక తమ సంక్షేమం కోసం ఇటువంటి మంచి పధకం ప్రవేశపెట్టి అమలుచేస్తున్నందుకు వారు ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకోవడం సహజమే. అందుకోసం ఈ నెల 29న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభను ఏర్పాటుచేయబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అయన నిన్న గొల్ల, కురుమ ముఖ్య నాయకులతో సమావేశమైన తరువాత ఈ ప్రకటన చేశారు. 

గొల్ల, కురుమ నాయకులతో సమావేశమైన తరువాత మంత్రి తలసాని బహిరంగ సభ ఏర్పాటు ప్రకటన చేయడం గమనిస్తే ఇది రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నదేనని స్పష్టం అవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆ రెండు వర్గాల ప్రజలను పూర్తిగా తెరాసవైపు ఆకర్షించేందుకే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకొనే మిషతో బహిరంగ సభ నిర్వహించడానికి సిద్దపడుతున్నట్లు భావించవచ్చు. అయితే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఇటువంటి ప్రయత్నాలు చేయడం కూడా సహజమే కనుక తెరాసను తప్పు పట్టలేము. 


Related Post