రాహుల్ కి మరో అగ్నిపరీక్ష!

February 10, 2018


img

గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ భాజపా కంచుకోటను అది బద్దలు కొట్టగలిగింది. గుజరాత్ ఎన్నికలలో అన్ని తానై నడిపించిన రాహుల్ గాంధీకే ఆ క్రెడిట్ దక్కుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. గుజరాత్ తరువాత కాంగ్రెస్ పాలిత కర్నాటక రాష్ట్రంలో  రాహుల్ గాంధీ మళ్ళీ తన పార్టీని గెలిపించుకోవలసి ఉంది. కర్నాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున లేదా మే మొదటివారంలో ఎన్నికలు జరుగుతాయి. కనుక రాహుల్ గాంధీ నేటి నుంచే ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టేశారు. 

అయితే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూల, ఒక ప్రతికూల అంశం ఉంది. అనుకూలమేమిటంటే, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటం. గుజరాత్ లో రెండున్నర దశాబ్దాలుగా భాజపా పాతుకుపోయున్నప్పటికీ, అక్కడ భాజపాకు ముచ్చెమటలు పట్టించగలిగారు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న కర్ణాటకలో భాజపాను నిలువరించడం తేలికే అని భావించవచ్చు. 

ఇదివరకు రాష్ట్రాన్ని ఏలిన ఎడ్యూరప్ప అవినీతికి విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తప్ప కాంగ్రెస్ గొప్పదనం చూసి మాత్రం కాదని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. అదే కాంగ్రెస్ కు ప్రతికూల అంశం. 

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా, ఓడిపోయినా ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పై ఆ ప్రభావం తప్పకుండా పడుతుంది. ముఖ్యంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రభావం కనిపించవచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే, తెలంగాణాలో తెరాసను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వెయ్యేనుగుల బలం చేకూరుతుంది. కనుక కర్ణాటక శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించుకోవడం రాహుల్ గాంధీకి అగ్నిపరీక్ష వంటివేనని చెప్పవచ్చు. ఒకవేళ గెలిపించుకోగలిగితే ఇక కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేరు. 


Related Post