సిఎం కెసిఆర్...మరో గొప్ప ఆలోచన! గ్రేట్!

February 10, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తూనే ఉంటారని నిరూపిస్తూ శుక్రవారం మరో గొప్ప ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి అధికారులతో చర్చించారు. ప్రగతి భవన్ లో నిన్న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు.  

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలందరికీ ఈ వెసులుబాటు ఉన్నందున వారు ఏటా క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకొంటారని, ఆ కారణంగా చాలా వరకు రోగాలబారిన పడకుండా తప్పించుకోగలుగుతున్నారని కానీ భారత్ లో పేదరికం, ఆర్ధిక పరిమితుల కారణంగా ప్రజలు ప్రాణాల మీదకు వచ్చే వరకు ఎటువంటి పరీక్షలు నిర్వహించుకోరని అన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులను మార్చాలనుకొంటున్నానని, రాష్ట్రంలో ప్రజలందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరికీ ఉచితంగా అన్నిరకాల వైద్య పరీక్షలు, మందులు, ప్రభుత్వ దవాఖానాలలో వైద్యం అందించాలనుకొంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. చికిత్స కంటే రోగ నివారణే మేలని గుర్తు చేశారు. తెలంగాణా ఏర్పడిన తరువాత వైద్య,ఆరోగ్యశాఖ చేపట్టిన అనేక చర్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. ఆ కారణంగా రాష్ట్రంలో వైద్యసేవలు చాలా మెరుగయ్యాయని అన్నారు. 

గ్రామాలలో  ప్రజారోగ్యం కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఆశావర్కర్ల జీతాలు పెంచుతామని, వారిని ఆరోగ్య సహాయకులుగా గుర్తిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అదేవిధంగా సెకండ్ ఏ.ఎన్.ఎం.ల జీతాలు కూడా త్వరలోనే పెంచుతామన్నారు. ప్రజారోగ్యం విషయంలో కూడా తెలంగాణా రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రజారోగ్యం కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదన్నారు.

కెసిఆర్ కిట్స్ కారణంగా ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు పెరగడంతో అవి ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీపడే స్థాయికి ఎదిగాయని, కనుక తమకు కూడా కెసిఆర్ కిట్స్ అందించాలని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కెసిఆర్ చెప్పారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు కెసిఆర్ కిట్స్ అందించదలచుకోలేదని, వీలైనంతవరకు ప్రభుత్వాసుపత్రులను ఇంకా సమర్ధంగా వినియోగించుకొనేందుకు ప్రయత్నిద్దామని అన్నారు. అందుకోసం ప్రభుత్వాసుపత్రులను మరింత ఆధునీకరిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. 


Related Post