కాంగ్రెస్, తెరాస నేతల మద్య జరుగుతున్న మాటల యుద్ధంలో వారి ఊహాత్మక శక్తిని, మాటల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు మంచి వినోదం పంచిపెడుతున్నారు.
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటిఆర్ ‘రాజకీయ సన్యాసం’ సవాలుతో ప్రారంభమైన ఈ యుద్ధం ‘లోఫర్లు, బ్రోకర్లు’ స్థాయికి దిగజారింది. ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ దానిని కొనసాగిస్తూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఠా బాహుబలి సినిమాలో ప్రజల ఉసురుపోసుకొనే ‘కాలకేయ ముఠా’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, “రాష్ట్రాన్ని కెసిఆర్ ధర్మరాజులా పరిపాలిస్తుంటే, కాంగ్రెస్ నేతలు అసూయతో ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. యువనేత కేటిఆర్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాలు విసిరితే రాజకీయాల నుంచి రిటైర్ కావలసిన వయసులో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిని ధైర్యంగా స్వీకరించలేకపోయారన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు బుట్టేచోర్ బ్యాచ్ లా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్-తెరాసల మద్య జరుగుతున్న ఈ ఏహ్యమైన గొడవలు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వ్యాపించడం దురదృష్టకరం. కాంగ్రెస్ నేతలు మంత్రి కేటిఆర్ పై చేస్తున్న విమర్శలను నిరసిస్తూ తెరాస అనుబంద విద్యార్ధుల సంఘం టి.ఆర్.ఎస్.వి.(ఓ.యు.) అధ్యక్షుడు గదరాజు చందు నేతృత్వంలో నిన్న విద్యార్ధులు కాంగ్రెస్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఆ సందర్భంగా గదరాజు చందు రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాటి నాయకులు ఇటువంటి విమర్శలు చేసుకొంటూ ఒకరిపై మరొకరు పైచెయ్యి సాధించాలనుకొంటారు. కానీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈలోగా 100 సీట్లు గెలవలేకపోతే రాజకీయ సన్యాసం అంటూ సవాళ్ళు విసరడం రాజకీయ వ్యూహంలో ఎత్తుగడే కావచ్చు. దీనితో కాంగ్రెస్ బలహీనంగా ఉందని నిరూపిద్దామనుకొని తెరాస అనుకొని ఉండవచ్చు. కానీ సరిగ్గా ఇదే..కాంగ్రెస్ నేతలందరినీ మరింత సంఘటిత పరిచింది. వారిలో తమ పార్టీ పట్ల అభిమానాన్ని ప్రజ్వలింపజేసింది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలు చాలా ధీటుగా స్పందిస్తున్నారు.
ఈ మాటల యుద్ధం వలన ఆ రెండు పార్టీలలో ఏదైనా పైచెయ్యి సాధిస్తుందో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజాసమస్యల గురించి మాట్లాడవలసిన నేతలు ఇటువంటి వ్యర్ధమైన సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో కాలక్షేపం చేయడం బాధాకరమే.