రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ యూత్ కాన్ క్లేవ్-2018 సదస్సులో మాట్లాడుతూ వ్యాపారంలో..రాజకీయాలలో వారసత్వం నిలబెట్టుకోవడం అంత తేలిక కాదన్నారు. విశేషమేమిటంటే ఆ సదస్సులో పాల్గొన్న కేటిఆర్, ఒమర్ అబ్దుల్లా, సచిన్ పైలెట్ తదితరులు అనేకమంది వారాసత్వ రాజకీయాల ద్వారా పైకి వచ్చినవారే కనుక వారూ కేటిఆర్ అభిప్రాయంతో ఏకీభవించవచ్చు.
నిజానికి వ్యాపారం రాజకీయాలే కాదు ఏ రంగంలోనైనా వారసత్వం నిలబెట్టుకోవడం చాలా కష్టమే. స్వయంకృషి, ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, ఎంతో కొంత అదృష్టమూ కూడా ఉంటే తప్ప వారసత్వం నిలబెట్టుకోవడం కష్టమే. ఉదాహరణకు కేటిఆర్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకొంటుంటే, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వ్యాపారాలలో రాణించగలిగారు కానీ రాజకీయాలలో తన ఉనికిని చాటుకోలేకపోతున్నారనేది జనాభిప్రాయం.
అలాగే ఎటువంటి రాజకీయ వారసత్వం లేని నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో అనేక సవాళ్ళను, అగ్నిపరీక్షలను ఎదుర్కొని ప్రధాన మంత్రి కాగలిగారు. కానీ నెహ్రూ వంశోద్ధారకుడైన రాహుల్ గాంధీ తల్లి సోనియాగాంధీ, పార్టీ సీనియర్ నేతల అండదండలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి భయపడి ఒక గొప్ప సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకొన్నారు. అయితే ఆయన కూడా ఇప్పుడిప్పుడే తల్లి కొంగు చాటు నుంచి బయటకు వచ్చి తన నాయకత్వ లక్షణాలు లోకానికి చూపుతున్నారు. గుజరాత్ ఎన్నికలలో మోడీ, అమిత్ షా ఇద్దరికీ ముచ్చెమటలు పట్టించగలిగారు.
ఇక వారసత్వ వ్యాపారాలలో అంబానీ సోదరుల గురించి అందరికీ తెలిసిందే. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరూ తండ్రి ధీరూభాయ్ అంబానీకి తగ్గ కొడుకులు అని నిరూపించుకోగలిగారు. కానీ వారిలో అన్న ముఖేష్ అంబానీ తండ్రికి అసలైన వారసుడనిపించుకొంటున్నారు.
ఇక మన తెలుగు సినీపరిశ్రమలో బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రాం చరణ్ తేజ్, నాగ చైతన్య తదితరులు అందరూ వారసులే. అయితే వారసత్వంగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అందరూ తమ సత్తా చాటుకొని నిలద్రొక్కుకోగాలిగారు. ఈవిధంగా ప్రతీ రంగంలో వారసులు కనిపిస్తూనే ఉంటారు. వారిలో కొందరు దానిని నిలబెట్టుకొంటాఋ. మరికొంతమంది ఆ అవకాశాన్ని నిలబెట్టుకోలేక కనుమరుగవుతుంటారు. కనుక వారసత్వం నిలబెట్టుకోవడమంటే అంత వీజీ కాదన్న మాట!