తెరాసది వన్ సైడ్ లవ్వా?

February 09, 2018


img

మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న పలు పధకాలకు, తీసుకొంటున్న పలు ఏకపక్ష నిర్ణయాలకు కూడా తెరాస సర్కార్ గట్టిగా మద్దతు ఇస్తోంది. మోడీ సర్కార్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంతునప్పుడు ఒక మంచి స్నేహితుడిగా అండగా నిలబడుతోంది. అయినప్పటికీ మోడీ సర్కార్ మాత్రం తెలంగాణా రాష్ట్రాన్ని, తెరాస సర్కార్ చేస్తున్న ప్రతిపాదనలను పట్టించుకొన్న దాఖలాలు కనబడటం లేదు. చివరికి బడ్జెట్ కేటాయింపులలో కూడా తెలంగాణాను అశ్రద్ధ చేసింది. అయినప్పటికీ తెరాస సర్కార్ చాలా సంయమనంతో వ్యవహరిస్తోంది. 

తెరాస ఎంపి కవిత ఇదే విషయం లోక్ సభలో కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం కేంద్రానికి అవసరమైనప్పుడల్లా అండగా నిలబడుతున్నప్పటికీ బడ్జెట్ లో తెలంగాణాకు ఎందుకు అన్యాయం చేశారని నిలదీశారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పదేపదే కోరినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలనైనా ఇంతవరకు అమలుపరచలేదని ఆక్షేపించారు. మోడీ సర్కార్ వ్యవసాయం కంటే వ్యాపారరంగానికే ఎక్కువ ప్రధాన్యతనిస్తోందని అది సరికాదని కవిత అన్నారు. ఎరువులను దిగుమతి చేసుకొనే బదులు దేశీయంగా ఎరువుల తయారీ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఆమె ఇంకా అనేక విలువైన సూచనలు చేశారు. అయితే గత మూడున్నరేళ్ళలో తెరాస ఎంపిలు, తెరాస సర్కార్ ఇటువంటి అనేక మంచి సూచనలు చేశారు. కానీ కేంద్రం వాటిని పట్టించుకోలేదు. కనుక కవితకి కంఠశోషే మిగిలిందనుకోవచ్చు. ఒకవేళ తెలంగాణా రాష్ట్రంలో భాజపాకు మంచి విజయావకాశాలు ఉండి ఉంటే, అప్పుడు కేంద్రం వైఖరి మరోవిధంగా ఉండేదేమో? కానీ రాష్ట్రంలో భాజపా పరిస్థితి గురించి కేంద్రానికి కూడా తెలుసు. కనుక లాభం లేదని తెలిసినప్పుడు ఏ వ్యాపారి పెట్టుబడి పెట్టడు కదా? అందుకే ఈసారి బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఏమీ రాల్చలేదు.


Related Post