కేటిఆర్ తీరు జుగుప్సాకరం: జానారెడ్డి

February 09, 2018


img

కాంగ్రెస్ పార్టీని మంత్రి కేటిఆర్ ‘లోఫర్ పార్టీ’ అనడంపై సిఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక మంత్రిగా చాలా గౌరవనీయమైన స్థానంలో ఉన్న కేటిఆర్ చాలా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. అయన మాటలు, తీరు అహంకారాన్ని ప్రతిభింబిస్తున్నాయి. వాటిని మేము ఖండిస్తున్నాము. రాజకీయాలలో ఉన్నవారు ముందుగా నోటిపై, బాషపై నియంత్రణ కలిగి ఉండాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఎదుటవారిపై పైచెయ్యి సాదించామనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. రాజకీయాలలో ఉన్నవారు మంచి సంస్కారం, సరైన వ్యవహారతీరు కలిగి ఉండటం చాలా అవసరమని నేను పదేపదే చెపుతుంటాను. మావాళ్ళకు కూడా బాష, సంస్కారం రెండూ చాలా అవసరమని నేను సూచిస్తుంటాను. తెరాస నేతలు ఏవిధంగా మాట్లాడినా మనం మాత్రం గౌరవప్రదంగా మెలుగుతూ మాట్లాడాలని మా వాళ్ళకు చెపుతుంటాను. ఎందుకంటే అందరూ ఇదేవిధంగా మాట్లాడితే రాజకీయాలు ఇంకా భ్రష్టు పట్టిపోతాయి.

తెరాస నేతలకు ఎన్ని సార్లు చెప్పినా వారి బాష, వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. అది నానాటికీ ఇంకా దిగజారిపోతూనే ఉంది. మమ్మల్ని లోఫర్ పార్టీ అంటే మిమ్మల్ని బ్రోకర్ పార్టీ అంటే మీరేమి సమాధానం చెపుతారు? మా పార్టీని కాలిగోటితో పోల్చారు. మరి తెలంగాణా కోసం మీరు ఎవరు కాళ్ళు పట్టుకొన్నారో అప్పుడే మరిచిపోయారా?” అని జానారెడ్డి అన్నారు.

తెరాస అధినేత కెసిఆర్ తన కంటే సీనియర్స్ అయిన కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి ‘సన్నాసులు...దద్దమ్మలు’ అని అంటునప్పుడు, పార్టీలో మిగిలినవారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని ఆశించలేము. అయితే కేటిఆర్ వంటి ఉన్నత విద్యావంతుడు, విదేశాలలో చిరకాలం ఉండి వచ్చిన వ్యక్తి నోటి నుంచి ఇటువంటి మాటలు వెలువడటం చాలా ఆశ్చర్యం, బాధ కలిగిస్తాయి. పార్టీల మద్య రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఆ కారణంగా ఒకరినొకరు వ్యక్తిగత స్థాయిలో దూషించుకొనే స్థాయికి దిగితే అది అద్దాల మేడలో కూర్చొని రాళ్ళు విసురుకొన్నట్లే అవుతుంది. దాని వలన వారే నవ్వులపాలవుతారు. ప్రజలు...మీడియా తమను నిశితంగా గమనిస్తున్నారని, తమ మాటలు, వ్యవహార తీరును వారు బేరీజు వేసుకొంటున్నారని మరిచిపోకూడదు. జానారెడ్డి చెప్పినట్లుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఎదుటవారిపై పైచెయ్యి సాధించామనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. ఇది రాజకీయాలలో ఉన్నవారందరికీ వర్తిస్తుంది. 


Related Post