“వచ్చే ఎన్నికలలో తెరాస 100 సీట్లు సాధించడం ఖాయం లేకుంటే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమేనా?” అని మంత్రి కేటిఆర్ విసిరిన సవాలుకు ఊహించినట్లుగానే కాంగ్రెస్ నేతలు ఆ సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. విశేషమేమిటంటే, ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ ఆలీ కూడా ఆ సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తాము కూడా రాజకీయ సన్యాసం చేస్తామని వారిరువురూ ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికలలో తెరాస గెలుపుపై ఆ పార్టీ ఎంత ధీమాగా ఉందో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఆ పార్టీ నేతలు కూడా అంతే నమ్మకంగా ఉన్నారని స్పష్టం అవుతోంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, “ఇతర పార్టీల నేతలకు వల వేసి దివాళాకోరు రాజకీయాలు చేసే కేటిఆర్ ఒకసారి నా కార్యాలయానికి కూడా వచ్చారు. తెరాసలో చేరితే నాకు మంత్రి పదవి ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చారు. నేను తెరాస తలుపు తట్టడం కాదు...ఆయనే నా తలుపు తట్టారు. ఆయన వచ్చినప్పుడు నా కార్యాలయంలో ఉన్న సిసి కెమెరాలలో రికార్డయిన వీడియో ఫుటేజ్ నా దగ్గర భద్రంగా ఉంది. దానిని బయటపెడితే ఎవరు ఎవరి దగ్గరకు వచ్చారో ప్రజలకు కూడా తెలుస్తుంది. కేటిఆర్ విసిరిన సవాలును నేను కూడా స్వీకరిస్తున్నాను. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు రాజకీయ సన్యాసం స్వీకరించడానికి రెడీ. మరి కెసిఆర్ కుటుంబం కూడా అందుకు సిద్దమేనా?” అని సవాలు విసిరారు.
సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైదరాబాద్ లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కేటిఆర్ విసిరిన సవాలును నేను కూడా స్వీకరిస్తున్నాను. ఆయనకు దమ్ముంటే అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తే అక్కడే అందరి సమక్షంలో ప్రతిజ్ఞలు చేసుకొందాము. ఏ పార్టీ ఓడిపోతే వారు రాజకీయ సన్యాసం చేద్దాం. సరేనా? 2014 ఎన్నికల సమయంలో నన్ను తెరాసలోకి రమ్మని ఆహ్వానించిన మాట వాస్తవమా కాదా? కేటిఆర్ చెప్పాలి. టికెట్లు, మంత్రిపదవులు ఆశజూపి ఫిరాయింపులను ప్రోత్సహించడం తెరాసకు అలవాటే. కానీ అందరూ ఆ ప్రలోభాలకు లొంగుతారనుకోవడమే భ్రమ. వచ్చే ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీఏ విజయం సాధిస్తుంది..రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది,” అన్నారు.
అధికార పార్టీకి ప్రతిపక్షాలు ‘రాజకీయ సన్యాసం సవాళ్ళు’ విసరడం సహజమే. ఎందుకంటే అది కొండకు వెంట్రుక ముడివేసి లాగే ప్రయత్నమే. వస్తే..కొండ కదిలి వస్తుంది లేకుంటే వెంట్రుక పోతుంది అంతే! కనుక ఇటువంటి సవాళ్ళ వలన వారికి కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ అధికార పార్టీలో ఉన్నవారు ఇటువంటి సవాళ్ళు విసిరితే వారికే నష్టమని కాంగ్రెస్ నేతల ఈ ప్రతిసవాళ్ళు నిరూపిస్తున్నాయి. షబ్బీర్ అలీ విసిరిన సవాలును స్వీకరించి మంత్రి కేటిఆర్ అమరవీరుల స్థూపం వద్ద ప్రతిజ్ఞ చేయగలరా? చేయకపోతే ఎవరిది పైచెయ్యి అవుతుంది? చేస్తే ఏమవుతుంది? అని ఆలోచిస్తే ప్రతిపక్షాలకు ఇటువంటి సవాళ్ళు విసరడం తప్పని అర్ధం అవుతుంది. అయితే కేటిఆర్ తన సవాలుకు గట్టిగా కట్టుబడి ఉండదలిస్తే, ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టే అవకాశం కూడా లభించింది. కానీ ఈ సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో ఒకరినినొకరు ముగ్గులోకి దింపాలని చూస్తారు కానీ ఎవరూ ముందుకు రారని అందరికీ తెలుసు.