భాజపాతో పొత్తులకు అది సంకేతమా?

February 08, 2018


img

మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చిట్టచివరి బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు హ్యాండ్ ఇచ్చినందుకు మిత్రపక్షమైన తెదేపా కేంద్రంపై కత్తులు దూస్తూ తెగతెంపులకు సిద్దపడుతుంటే, ఆంధ్రా కంటే తక్కువ నిధులు లభించినప్పటికీ తెరాస సర్కార్ మాత్రం చాలా సంయమనంగా వ్యవహరిస్తుండటం విశేషం. తెరాస ఎంపిలు తెలంగాణాకు జరిగిన అన్యాయం గురించి పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగానే నిలదీస్తున్నారు. కానీ డిల్లీలో, రాష్ట్ర స్థాయిలో తెరాస ఎటువంటి హడావుడి చేయడంలేదు. చేసి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి మరింత దయనీయంగా మారి ఉండేది. కనుక తెరాస వ్యూహాత్మక మౌనం తెలంగాణాలో భాజపాకు చాలా ఉపశమనం కలిగిస్తోంది.

అయితే ఇటువంటి సందర్భాలలో చాలా తీవ్రంగా స్పందించే తెరాస ఇంత  సంయమనంగా ఎందుకు వ్యవహరిస్తోంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి రెండు జవాబులు కల్పిస్తున్నాయి. 1. వచ్చే ఎన్నికలలో భాజపాతో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన. 2. మిత్రపక్షమైన తెదేపా భాజపాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తునందున మళ్ళీ తెరాస చేతికి మట్టి అంటించుకోవలసిన అవసరం ఏముంది? ఆ దెబ్బకు ఏపితో బాటు తెలంగాణా డిమాండ్స్ కూడా తీర్చకపోతుందా? అనే ధీమా కావచ్చు. 

రాష్ట్రంలో భాజపా పరిస్థితి అంతంతమాత్రమేనని అందరికీ తెలుసు. కనుక వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకొంటే మంచిదనే భావన దానిలో ఉండనేది బహిరంగ రహస్యం. కానీ తెరాస అందుకు సిద్దంగా లేదు. సిద్దపడాలంటే ఇప్పుడు తెరాస డిమాండ్స్ అన్నీ తీర్చాలి. ఆ జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్ల శాతం పెంచడం, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన చేసి అసెంబ్లీ సీట్లు పెంచడం వంటి ఇబ్బందికరమైన డిమాండ్స్ కూడా ఉన్నాయి. కనుక తెరాస-భాజపాల మద్య పొత్తులకు అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. 

ఏపిలో తెదేపాతో సహా ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడితో కేంద్రం దిగివచ్చి కొన్ని వరాలు ప్రకటించే అవకాశాలున్నాయి కనుక కాస్త ఒపికపడితే తెలంగాణాకు కూడా వరాల ప్రకటన ఉండవచ్చు. లేకపోతే అప్పుడే యుద్దం ప్రకటించే వెసులుబాటు ఎలాగూ ఉంది. మిత్రపక్షమైన తెదేపా కేంద్రానికి సంకటస్థితి సృష్టిస్తున్నప్పుడు తెరాస సంయమనం పాటిస్తే ప్రధాని మోడీకి కెసిఆర్ దగ్గరయ్యే అవకాశాలున్నాయి. ఆవిధంగా కూడా తెలంగాణాకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. బహుశః అందుకే తెరాస సంయమనం పాటిస్తోందేమో? 


Related Post