మోడీజీ! చరిత్ర పాఠాలు ఎందుకిప్పుడు?

February 07, 2018


img

2018-19 కేంద్ర బడ్జెట్ లో ఏపికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెదేపా, వైకాపా ఎంపిలు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి అడ్డుపడుతూ నినాదాలతో లోక్ సభను కాసేపు హోరెత్తించారు. అయితే ప్రధాని మోడీ వారి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా చరిత్ర పాఠాలు చెప్పడం విశేషం. స్వర్గీయ అంజయ్య, నీలం సంజీవ రెడ్డి, పివి నరసింహరావు తదితరుల పట్ల కాంగ్రెస్ అధిష్టానం అవమానకరంగా ప్రవర్తించిందని, ఆ అవమానాలను ఎదుర్కోవడానికే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమతానికి విరుద్దంగా పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసి మరీ విభజన బిల్లు ఆమోదింపజేసుకొందని, నేటి ఏపి దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోడీ ఆరోపించారు. నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు దేశానికి జరిగిన అన్యాయాల గురించి మోడీ సభలో ఏకరువు పెట్టారు. కానీ తెదేపా, వైకాపా ఎంపిలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఒకపక్క తమ పార్టీ తెలంగాణా ప్రజల ఆకాంక్షలను మన్నిస్తూ రాష్ట్ర విభజనకు సహకరించిందని చెపుతూనే, ‘విభజన పాపం’ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పడం విడ్డూరంగా ఉంది. 

మిత్రపక్షమైన తెదేపా ఎంపిలే ‘మోడీ సర్కార్ ఏపికి అన్యాయం చేసిందని’ లోక్ సభలో నినాదాలు చేస్తుంటే అవేవీ వినపడనట్లుగా నేటి ఏపి దుస్థితికి కాంగ్రెస్ కారణమని ప్రధాని మోడీ ఆరోపించడం ఇంకా విడ్డూరంగా ఉంది. మోడీ సర్కార్ కు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకు విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేసి ఉండేవారు. కానీ కొత్తగా ఏమీ చేయలేకపోయినా కనీసం ఉమ్మడి హైకోర్టునైనా ఇంతవరకు విభజించడానికి శ్రద్ధ చూపలేదు. 

కాంగ్రెస్ నేతలకు గట్టిగా, ఇంకా గట్టిగా అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించడం అలవాటని మోడీ ఎద్దేవా చేశారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలను ఇంతవరకు అమలుచేయకుండా చేశామని లేదా చేస్తున్నామని చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి? కేవలం శంఖుస్థాపనలు చేసేస్తే ప్రాజెక్టులు పూర్తయిపోవు కదా? వాటి నిర్మాణాలకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయాలి కదా? తెలంగాణా ప్రభుత్వం సుమారు రూ.36,000 కోట్లు విలువచేసే ప్రతిపాదనలు పంపితే దానిలో 1/4వ వంతు అయినా ఎందుకు ఆమోదించలేదు? బెంగళూర్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్ లో రూ. 17, 000 కోట్లు కేటాయించిన మోడీ సర్కార్ హైదరాబాద్ మెట్రోకి దమ్మిడీ కేటాయించలేదు. ఎందుకు? ఇప్పుడు అధికారంలో ఉన్నది మోడీ సర్కారే కదా కాంగ్రెస్ సర్కార్ కాదు కదా! కాంగ్రెస్ న్యాయం చేయలేదనే కదా...ప్రజలు మోడీకి పట్టం కట్టారు. మరి అయన కూడా రాష్ట్రాలకు ఎందుకు న్యాయం చేయడం లేదు? ఇటువంటి అనేక ప్రశ్నలకు మోడీ సర్కార్ నుంచి సమాధానాలు రావు. 


Related Post