తెరాస అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళకే ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వేలు చేయించి, అప్పటికప్పుడు ఎన్నికలొస్తే తెరాసకు ఎన్ని సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందో ప్రకటించారు. వాటిలో ప్రతీసారి ఖచ్చితంగా 100-105 సీట్లు తమకే వస్తాయని చెపుతున్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కళ్ళారా చూస్తున్న రాష్ట్ర ప్రజలు తెరాసవైపే ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెరాసయే విజయం సాధిస్తుందని, కెసిఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస నేతలు గట్టి నమ్మకంగా చెపుతుంటారు. ఇక బంగారి తెలంగాణా కోసమో లేక రాష్ట్రంలో తెరాసకు ఎదురే ఉండరాదనే ఉద్దేశ్యంతోనో తెరాస చేపట్టిన ‘రాజకీయ పునరేకీకరణ’ (పార్టీ ఫిరాయింపులు) కారణంగా రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రతిపక్షాలన్నీ దాదాపు నిర్వీర్యం అయిపోయాయిముఖ్యమంత్రి కెసిఆర్ మళ్ళీ మూడు వేర్వేరు సంస్థల చేత వేర్వేరుగా సర్వేలు చేయించినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఒక వార్త ప్రచురించింది.
దాని ప్రకారం ఆ మూడు సంస్థలు కలిసి సుమారు 10 లక్షల మంది ప్రజలను ప్రశ్నించి తమ నివేదికలను ముఖ్యమంత్రి కెసిఆర్ చేతికి ఇచ్చినట్లు పేర్కొంది. వాటిలో ఒకటి తెరాసకు 105 సీట్లు వస్తాయని తేల్చి చెప్పగా మరొకటి 103 సీట్లు వస్తాయని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. మూడవ సర్వే సంస్థ ఇంకా తన నివేదికను సమర్పించవలసి ఉంది.
రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా ఒక్క శాసనసభ సీటు కూడా గెలుచుకోలేదని ఒక సంస్థ చెప్పగా మరొకటి ఒక్క శాసనసభ సీటు మాత్రమే గెలుచుకోగలదని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇక వచ్చే ఎన్నికలలో కనీసం 70 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అది ఈసారి 7-9 సీట్లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని రెండు సర్వేలు తేల్చి చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 21 గెలుచుకొంటే ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతోందని సర్వేలు సూచిస్తున్నాయిట!
పైన చెప్పుకొన్నట్లు ఏవిధంగా చూసినా రాష్ట్రంలో తెరాసకే అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయని స్పష్టం అవుతోంది. కానీ మళ్ళీ సర్వే చేయించడం నిజమైతే అది తెరాస అభద్రతాభావానికి నిదర్శనంగా భావించవచ్చు. సర్వేలు సూచిస్తున్నట్లు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, ఏపిలో కనుమరుగు అయినట్లే తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కనుక వచ్చే ఎన్నికలు దానికి జీవన్మరణ సమస్య వంటివే కనుక అది తెరాసకు చాలా గట్టి పోటీనీయవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, డికె అరుణ, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, దానం నాగేందర్ వంటి హేమాహేమీలనదగ్గ నేతలు అనేకమంది ఉన్నారు. వారు పోటీ చేస్తే ఓడిపోయే ప్రసక్తే ఉండకపోవచ్చు. ఆవిధంగా లెక్క చూసుకొన్న కాంగ్రెస్ పార్టీ కనీసం 20-25 సీట్లు గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక తాజా సర్వే ఫలితాలను విశ్వసించడం కష్టమే. ఏమైనప్పటికీ, అటువంటి సర్వేలు..వాటి ఫలితాలు తెరాస శ్రేణులకు ఉత్సాహపరిచేందుకు బాగా ఉపయోగపడతాయి.