భలే అడిగావ్ వినోదన్నా!

February 07, 2018


img

దేశంలో రైతులందరి ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేయడం మోడీ సర్కార్ లక్ష్యమని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు. మంగళవారం లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ, “దేశంలో రైతుల ఆదాయం పెంచాలన్న ఆలోచన గొప్పదే. అయితే దాని కోసం కేంద్రప్రభుత్వం ఏమి చర్యలు చేపట్టింది? ఏమీ చేయకుండా ఆ లక్ష్యం సాధించడం ఏవిధంగా సాధ్యం” అని నిలదీశారు. 

అయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “అదే...మా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ళ క్రితం నుంచే ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తోంది. మిషన్ కాకతీయ పధకం క్రింద రూ.35,000 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో 40,000 చెరువులలో పూడిక తీయిస్తున్నాము. అది మొదలుపెట్టిన ఒకటి రెండు సంవత్సరాల నుంచే చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చిన్నా పెద్ద సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాము. వాటి ద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించబోతున్నాము. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. ఈ ఏడాది మే నెల నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఏడాదికి..ఎకరానికి రూ.4,000 చొప్పున పంట పెట్టుబడి అందించబోతున్నాము. సమగ్ర భూసర్వే చేయించి రైతులందరికీ త్వరలోనే పాస్ పుస్తకాలు అందించబోతున్నాము. రైతుల సంక్షేమం కోసం ఇంకా ఇటువంటివి అనేక చర్యలు చేపట్టింది మా ప్రభుత్వం. 

ఇటువంటి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టినప్పుడే రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు మీ నుంచి సహకారం అందుతుందని ఆశించాము. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేస్తుందని ఆశించాము. కానీ బడ్జెట్ లో దానికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు సామాజిక న్యాయం చేసేందుకు వారికి రిజర్వేషన్ల శాతం పెంచాలని కోరుతూ మా ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించి మీకు పంపింది. దానినీ మీరు పట్టించుకోలేదు. అసలు దానిపై మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణాకు సహాయసహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం ఎందుకు ఇంతగా వెనకాడుతోంది? ఈ ప్రశ్నలకు రేపు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను,” అని వినోద్ కుమార్ కేంద్రాన్ని కడిగిపడేశారు.  

ఏ ప్రభుత్వాలైనా గొప్ప గొప్ప లక్ష్యాలున్నాయని చెప్పుకోవడం సహజమే కానీ వాటిని సాధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా పనికిరాని రాజకీయాలతో, అధికారం, పదవులు, ఎన్నికలు, ఓట్లు, సీట్లు అంటూ కాలక్షేపం చేసేస్తుంటాయి. మన ఇరుగుపొరుగునే అటువంటి ప్రభుత్వాలు కనబడుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం మాత్రం మొదటి రోజు నుంచే రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తత్ఫలితంగా చాలా రంగాలలో నేడు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కూడా. వాటిని ఇరుగుపొరుగు రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వం కూడా గుర్తించి ప్రశంశిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం తనవంతు సహాయసహకారాలు అందించగలిగితే దాని లక్ష్యాలు కూడా తప్పకుండా నెరవేరుతాయి.


Related Post