టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మేధావి ముసుగులో ఉన్న కాంగ్రెస్ ఏజంటు అని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ ఆర్.సి.కుంతియా స్పందిస్తూ “తెరాస ఆరోపణలను ఖండిస్తున్నాము. ప్రొఫెసర్ కోదండరాం మా పార్టీకి ఏజంటూ కాదు...ప్రత్యర్ధి కాదు. ప్రజా సమస్యలపై మేము పోరాడుతున్నాము. ఆయన కూడా పోరాడుతున్నారు. ఆ కారణంగా కొన్ని సందర్భాలలో మేము కలిసి పనిచేస్తున్నాము. అంతమాత్రాన్న అయన మా ఏజంట్ అని ఆరోపించడం సరికాదు. అయన రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే, ఆ పార్టీతో ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవాలా వద్దా అనే విషయం నిర్ణయించుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. గుజరాత్ లో మాదిరిగానే తెలంగాణా రాష్ట్రంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారినందరినీ కలుపుకుపోవాలనుకొంటున్నాము,” అని అన్నారు.
గుజరాత్ లో పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కావాలని కోరుతూ ఉద్యమం ప్రారంభించి వెలుగులోకి వచ్చిన హార్దిక్ పటేల్ తో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో అధికార భాజపాకు ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కాంగ్రెస్ పార్టీ త్రుటిలో విజయం చేజార్చుకొంది. ఆ తప్పులను సరిదిద్దుకొని అదే ఫార్మూలాను తెలంగాణా రాష్ట్రంలో కూడా అమలుచేస్తామని కాంగ్రెస్ అధిష్టానం అప్పుడే ప్రకటించింది. గుజరాత్ లో హార్దిక్ పటేల్ ఎలాగో...తెలంగాణా రాష్ట్రంలో ప్రొఫెసర్ కోదండరాం అటువంటి వ్యక్తి అని కాంగ్రెస్ భావించడం సహజమే. గుజరాత్ ఫార్ములా తెలంగాణాలో కూడా ఆశించిన ఫలితాలు ఇస్తుందో లేదో తెలియదు కానీ తెరాస తన జాగ్రత్తలో తాను ఉండటం మంచిది.