తెదేపా ఎంపిల హడావుడి ఎప్పుడు ముగుస్తుందంటే...

February 06, 2018


img

కేంద్ర బడ్జెట్ లో ఏపికి అన్యాయం జరిగిందంటూ తెదేపా ఎంపిలు పార్లమెంటు లోపల బయటా ఆందోళన చేస్తున్నారు. మరోపక్క కేంద్రమంత్రి సుజనా చౌదరితో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అర్ధగంటసేపు సమావేశమయ్యారు. ఏపిని అన్నివిధాలుగా ఆదుకొంటామని కనుక ఆందోళనలు విరమించమని ప్రధాని మోడీ కోరగా, అది తన చేతుల్లో లేదని చెప్పి చౌదరి బయటకు వచ్చేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ లోక్ సభలో ఆందోళన చేస్తున్న తెదేపా, వైకాపా ఎంపిలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అంశం చాలా సున్నితమైనదని, ఏపిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకదృష్టి సారించారని కనుక ఆందోళన విరమించాలని కోరారు. రాజ్యసభ చైర్మన్ మరియు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆందోళన చేస్తున్న తెదేపా ఎంపిలను పిలిచి మాట్లాడారు.

విశేషమేమిటంటే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మొదలైనవి కావు. గత మూడున్నరేళ్ళుగా జరుగుతున్నవే. ప్రతీసారిలాగే ఈసారి కూడా పార్లమెంటు సమావేశాలతో బాటే ఈ హడావుడి అంతా ముగిసిపోవచ్చు. దీనికోసం తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకొంటే వచ్చే ఎన్నికలలో రెండూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా భాజపా ఎక్కువ నష్టపోవచ్చు. దానితో జత కట్టడానికి వైకాపా సిద్దంగా ఉన్నప్పటికీ, దానితో పొత్తులు పెట్టుకోవాలంటే అది కోరుతున్నట్లు ముందుగా ఏపికి ప్రత్యేకహోదా మంజూరు చేయవలసి ఉంటుంది. అది ఎలాగూ సాధ్యం కాదు. పైగా ఇంతకాలం జగన్ అవినీతి గురించి ప్రశ్నించి ఇప్పుడు అతనితోనే భాజపా చేతులు కలిపితే అది తెదేపాకు ఆయుధంగా మారుతుంది. కనుక వైకాపాతో పొత్తులు పెట్టుకొనే అవకాశం లేదు. కనుక చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకొని తెదేపాతో పొత్తులు నిలుపుకొనేందుకు మోడీ సర్కార్ ఏపికి ఎంతో కొంత అధనంగా నిధులు కేటాయించి ఈ టీ కప్పులో చెలరేగిన తుఫానును చల్లార్చవచ్చు.


Related Post