గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖుల మాదకద్రవ్యాల కేసు ప్రధానమైనది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నటీనటులు ఇంకా అనేకమందిని మాదకద్రవ్యాల కేసులలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సభర్వాల్..అయన బృందం విచారించినప్పుడు ఎంత కలకలం రేగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. దాదాపు రెండు వారాలపాటు సాగిన విచారణలో అందరి వాంగ్మూలాలు తీసుకొన్నారు. కొంతమంది గోళ్ళు, జుట్టు, రక్తం నమూనాలను కూడా సేకరించారు. ఆ సమయంలో ఈ వ్యవహారాలపై మీడియాలో చాలా జోరుగా చర్చలు సాగాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే నిందితులపై ఛార్జ్ షీట్స్ దాఖలు చేస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. రెండు నెలల క్రితం ఆ నివేదిక కూడా వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ కధ అక్కడితో ఆగిపోయింది. ఇంతవరకు ఎవరిపైనా ఛార్జ్ షీట్స్ దాఖలు చేయలేదు. విచారణను ఎదుర్కొన్న ప్రముఖులు ఎవరికీ నోటీసులు అందలేదు. బహుశః మాదకద్రవ్యాల కేసు విచారణతో సమాప్తం అయిపోయిందని సరిబెట్టుకోవాలేమో?
మరి ఈ మాత్రం దానికి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు అంటే మియాపూర్ భూకుంభకోణంపై నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించడానికేనన్న కాంగ్రెస్ నేతల వాదనలను గుర్తు చేసుకోవాలేమో? అటు మియాపూర్ కుంభకోణం వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఇటు ఈ మాదక ద్రవ్యాల కేసు కొలిక్కి రాలేదు. మొదటిది కోర్టులో..రెండవది కోర్టు గడప దగ్గర నిలిచిపోయినట్లున్నాయి. ఆనాడు మాదకద్రవ్యాల కేసుల గురించి వరుస కధనాలు ప్రసారం చేసిన మీడియాకు కూడా ఇప్పుడు వాటి గురించి ఆలోచించే తీరిక, ఆసక్తి లేదు. కనుక ఆ కేసులు మెల్లగా అటకెక్కిపోయినట్లున్నాయి. మళ్ళీ ఎప్పుడైనా మాదకద్రవ్యాలు పట్టుబడితే, అప్పుడు మళ్ళీ ఈ కేసుల ఊసులు వినిపించవచ్చు.