మిత్రపక్షం లొల్లి చేస్తుంటే...తెరాస సల్లగుందేమిటి?

February 06, 2018


img

మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన చిట్టచివరి బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది. అయితే భాజపాకు మిత్రపక్షంగా, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెదేపా పార్లమెంటు లోపల బయటా ఏపికి న్యాయం చేయాలంటూ చాలా హడావుడి చేస్తుంటే, భాజపాను రాజకీయ శత్రువుగా భావిస్తున్న తెరాస మాత్రం అసలు ఏమీ జరగనట్లు చాలా కూల్ గా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈవిధంగా వ్యవహరించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అంతర్యం ఏమిటని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 

“రాష్ట్రానికి ఇస్తామన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ ఆసుపత్రి ప్రస్తావన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలనే తెరాస సర్కార్ అభ్యర్ధనను కేంద్రం పట్టించుకోలేదు. బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు. అసలు తెలంగాణా రాష్ట్రాన్నే పట్టించుకోలేదు. అయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయయం గురించి తెరాస సర్కార్ కేంద్రాన్ని నిలదీయడం లేదు. భాజపాకు మిత్రపక్షంగా ఉన్న తెదేపా గట్టిగా నిలదీస్తోంది కానీ భాజపాతో సంబంధం లేని తెరాస కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? ఇదివరకు ఉద్యమ సమయంలో మా కాంగ్రెస్ నేతలు మా స్వంత ముఖ్యమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణా ఇవ్వాలని గట్టిగా నిలదీశాము. చివరికి తెలంగాణా సాధించుకొన్నాము.  కానీ కెసిఆర్ మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మౌనం వహిస్తున్నారు. ఎందుకు? రాష్ట్ర భాజపా నేతలు కూడా నోరు మెదపకుండా ఉండిపోయారు. కనుక విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ అమలుకోసం మేమే చొరవ తీసుకొని ఉద్యమిస్తాము,” అని పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ రాష్ట్రానికి అన్యాయం లేదా నష్టం కలుగుతుందంటే ఆయన చూస్తూ ఊరుకొనే మనిషి కాదని అందరికీ తెలుసు. ఏపిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా రాజధాని బొమ్మల గ్రాఫిక్స్ చూపిస్తూ ఇన్నాళ్ళు రోజులు దొర్లించేసిన ఏపి సర్కార్, ఎన్నికలు దగ్గర పడుతున్నందున తన వైఫల్యాలను కేంద్రం, భాజపాల పద్దులో వ్రాసేసి తను క్షేమంగా బయటపడాలని ఆరాటపడుతోంది. అందుకే ఈ డ్రామాలు ఆడుతోందని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను కాదనలేము. 

తెలంగాణాలో ఏపికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణా శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. దానికి కేంద్రం నిధులు, సహకారం రెండూ అవసరమే కానీ దాని కోసం తెదేపా ఎంపిలలాగ హడావుడి చేయనవసరం లేదు. మిత్రపక్ష ఎంపిలు పార్లమెంటు లోపలా బయటా లొల్లి చేస్తుంటే తెరాస ఎంపిలు నేరుగా కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావలసినవి రాబట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కెసిఆర్ కు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు. బహుశః అందుకే బడ్జెట్ కేటాయింపులపై ఇంతవరకు స్పందించలేదు. కానీ అయన మౌనం అంగీకారంగా భావించడం అవివేకమే అవుతుంది.


Related Post