ఇది సంతోషించదగ్గ వార్తే!

February 06, 2018


img

“తెలంగాణా విడిపోతే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. మావోయిస్టులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇంకా అనేక ఉపద్రవాలు సంభవించే ప్రమాదం ఉంది,” అని ఆంధ్రా పాలకులు చాలా భయపెట్టారు. కానీ మూడున్నరేళ్ళలోనే తెలంగాణా అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోంది. 

తెలంగాణా పోలీస్, జైళ్ళ శాఖలు కూడా దేశవ్యాప్తంగా మంచిపేరు సంపాదించుకొంటున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాతో సహా అనేక దేశాల ప్రతినిధులు, ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అదే సమయంలో మెట్రో రైల్ సర్వీసులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ తరువాత కొన్ని రోజుల వ్యవదిలోనే ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా జరిగాయి. వెనువెంటనే కుంభమేళకు తీసిపోని మేడారం జాతర జరిగింది. అంతకు ముందు హైదరాబాద్ లో బతుకమ్మ వేడుకలు, బోనాలు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మూడున్నరేళ్ళలో హైదరాబాద్ నగరంలో ఒక్క చిన్న మత ఘర్షణ కూడా జరుగలేదు. నగరంలో చాలా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. వరుసగా ఇన్ని అతిపెద్ద కార్యక్రమాలు జరిగినా ఎక్కడా చిన్న అవాంచనీయ సంఘటన కూడా జరుగలేదు. నిసందేహంగా ఆ క్రెడిట్ తెలంగాణా పోలీస్ శాఖకే చెందుతుంది.  

రాష్ట్రంలో నేటికీ చెదురుముదురుగా నేరాలు జరుగుతున్నప్పటికీ, పోలీస్ శాఖ అప్రమత్తత కారణంగా నేరాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా రాష్ట్రంలో 5 సబ్ జైళ్ళు మూసివేతను చెప్పుకోవచ్చు. జైళ్ళకు వచ్చే ఖైదీల సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఆర్మూర్‌, బోధన్‌, నర్సంపేట, పరకాల, మధిరల్లో సబ్‌ జైళ్లను మూసివేస్తున్నామని రాష్ట్ర జిల్లా శాఖ డిజి వికె సింగ్ తెలిపారు. వాటిలో ఒకరిద్దరు ఖైదీలు మాత్రమే ఉంటునందున వారిని సమీపంలోని వేరే జైళ్ళకు తరలించి ఈ 5 జైళ్ళను మూసివేశామని వికె సింగ్ చెప్పారు. ఇదేవిధంగా సాగితే మున్ముందు రాష్ట్రంలో జైళ్ళకు బదులు వాటిలో పరిశ్రమలు, కాలేజీలు ఏర్పాటుచేసుకోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదని వికె సింగ్ అన్నారు. 

రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణా జైళ్ళలో మొత్తం 6,012 ఖైదీలు ఉండగా, 2018, జనవరి 27వ తేదీ నాటికి 5,348 మంది మాత్రమే ఉన్నారన్నారు. జైళ్ళలో ఖైదీలను శిక్షించడం కాక వారిలో పరివర్తన తీసుకువచ్చి మంచి మార్గంలోకి మళ్ళిస్తుండటం వలననే ఇది సాధ్యపడుతోందన్నారు. 

జైళ్ళలోపల ఖైదీల పరివర్తనకు జరుగుతున్న కృషి, బయట పటిష్టమైన పోలీసింగ్ వెరసి రాష్ట్రంలో నేరాల సంఖ్యను అదుపులోకి తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయమే కదా! 


Related Post