కోదండరాంపై అప్పుడే విమర్శలా?

February 06, 2018


img

ప్రొఫెసర్ కోదండరాం త్వరలో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్షరాజకీయాలలోకి రాబోతున్నట్లు ప్రకటించగానే మొట్టమొదట తెరాస స్పందించింది. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సోమవారం తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “కెసిఆర్ లాగ రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అవుదామని ప్రొఫెసర్ కోదండరాం పగటి కలలు కంటున్నట్లున్నారు. కానీ కెసిఆర్ రాజకీయ చతురత ముందు ప్రొఫెసర్ కోదండరాం పైసాకు పనికి రాడు. ఎన్నికలప్పుడు ఏ పార్టీలోను టికెట్స్ దొరకనివారే కోదండరాం పార్టీలో చేరుతారు. రాష్ట్ర ప్రజలందరూ తెరాస వెంటే ఉన్నారు కనుక తెలంగాణాలో అయన పార్టీని ఎవరూ పట్టించుకోరు. ఆ కారణంగా అయన పెట్టబోయే ‘తెలంగాణా జనసమితి’ చివరికి ‘జనం లేని సమితి’గా మిగిలిపోవడం ఖాయం. అది రాష్ట్రంలోని రాజకీయ పార్టీలలో చివరి స్థానంలో నిలబడుతుంది,” అని ఎద్దేవా చేశారు. 

ప్రొఫెసర్ కోదండరాం తెరాస సర్కార్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు ‘ఆయనకు దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి తమను ఎదుర్కోవాలని’ సాక్షాత్ ముఖ్యమంత్రి కెసిఆర్ సవాలు విసిరారు. కెసిఆర్ సవాలును స్వీకరించి రాజకీయ పార్టీతో వారి ముందుకు వస్తుననపుడు తెరాస ఆయనను స్వాగతించి ఉండి ఉంటే హుందాగా ఉండేది. కానీ అప్పుడే ఈవిధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రాకతో అభద్రతాభావానికి లోనయిందనే భావన ప్రజలకు కలిగేలా చేసింది. 

జస్టిస్ చంద్రకుమార్ తను కూడా ఒక పార్టీ పెట్టబోతున్నట్లు ఆదివారమే ప్రకటించారు కానీ అయన చేసిన పార్టీ ప్రకటనను తెరాస పట్టించుకోలేదు. కానీ ప్రొఫెసర్ కోదండరాం చేసిన ప్రకటనపై వెంటనే స్పందించిందంటే అర్ధం ఏమిటి? ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తెరాసకు ఎంతో కొంత నష్టం జరుగుతుందనే కదా?     

ప్రొఫెసర్ కోదండరాం తన పార్టీ పేరు, జెండా, అజెండా ఏది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కనీసం అంతవరకు వేచి చూసి ఏవైనా విమర్శలు చేసినా అర్ధం ఉండేది కానీ అయన పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించగానే ఈవిధంగా స్పందించడం అభద్రతాభావం లేదా అహంభావాన్ని సూచిస్తోంది. రాజకీయాలలో అభద్రతాభావం సహజమే కానీ ఈవిధంగా అహంభావం ప్రదర్శిస్తే దానికి బారీ మూల్యం చెల్లించిన ఉదంతాలు కోకొల్లలున్నాయి. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తిగా ప్రొఫెసర్ కోదండరాంకు రాష్ట్ర ప్రజలలో అపారమైన గౌరవం ఉంది. అటువంటి వ్యక్తిపై ఈవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజల దృష్టిలో తెరాసయే పలుచన అవుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post