మోడీకి రాహుల్ ప్రత్యామ్నాయం...కాగలరా?

February 05, 2018


img

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ఆదివారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దేశప్రజల ముందు రెండే మోడల్స్ ఉన్నాయి. 1.మోడీ మోడల్. 2. రాహుల్ గాంధీ మోడల్. వీటిలో మోడీ మోడల్ పాలనను దేశప్రజలు అందరూ చూశారు. రాహుల్ మోడల్ పాలన చాలా సరళంగా...పారదర్శకంగా ఉంటుంది. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతుంది తప్ప ప్రధాని కేంద్రంగా పాలన సాగదు.

భాజపాకు మిత్రపక్షాలుగా ఉన్న మహారాష్ట్రలో శివసేన, ఏపిలో తెదేపా రెండూ కూడా భాజపాతో జత కట్టినందుకు పశ్చాతాప పడుతుండటం గమనిస్తే మోడీ పాలన ఏవిధంగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. కనుక మోడీకి ఏకైక ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీ మాత్రమే. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ ఏకం అయితే మోడీని సాగనంపి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం పెద్ద కష్టమైనా పనేమీ కాదు,” అని అన్నారు. 

దేశ ప్రజలు 10 ఏళ్ళ పాటు కాంగ్రెస్ పాలన చూశారు. సుమారు నాలుగేళ్ళుగా భాజపా పాలన చూస్తున్నారు. రెంటిలో భూమ్యాకాశాలకు ఉన్నంత వ్యత్యాసం ఉందనే సంగతి అందరికీ తెలుసు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు, అక్రమాల గురించి వార్తలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ అసమర్ధ అవినీతి పాలన కారణంగా ప్రపంచ దేశాలలో భారత్ పరువు పోయింది. నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను అత్యంత బలహీనమైన, అసమర్ధుడైన ప్రధాని అని విదేశీ పత్రికల కవర్ పేజీ స్టోరీలు ప్రచురించాయి. అయితే కాంగ్రెస్ పాలనలో భావప్రకటన స్వేచ్చ, మత స్వేచ్చ నెలకొని ఉండేది. అయితే ఆ రెండు గొప్ప లక్షణాలను దాని అవినీతి, అసమర్ధత మింగేసాయి. 

అందుకే దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి అధికార పగ్గాలు అప్పగించారు. మోడీ పాలనలో అవినీతి, అసమర్ధత, అక్రమాలు, కుంభకోణాల ఊసే వినబడటం లేదు. అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. వినిపించడమే కాదు కనిపిస్తోంది కూడా. 

కాంగ్రెస్ హయంలో అవినీతి, అక్రమాలు అసమర్ధత మొదలైన అవలక్షణాలు దాని లౌకికవాదాన్ని మరుగునపడేయగా, మతతత్వం, నిరంకుశత్వం, దళితులు, మైనార్టీ వర్గాల ప్రజలపై దాడులు వంటి అవలక్షణాలు మోడీ హయంలో జరుగుతున్న అభివృద్ధిని మసకబారుస్తున్నాయని చెప్పక తప్పదు. 

అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టించాలనే మంచి ఆలోచనతో నోట్ల రద్దు, జి.ఎస్.టి., నగదు రహిత లావాదేవీలు వంటి తొందరపాటు నిర్ణయాల వలన యావత్ దేశప్రజలు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. అవి దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఇవ్వవచ్చు కానీ అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేసేముందు, దాని తక్షణ విషపరిణామాలను కూడా అంచనా వేసి తదనుగుణంగా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుంటే ఆ నిర్ణయాలే మోడీ సర్కార్ కు గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టి ఉండేవి.     

కాంగ్రెస్, భాజపాల పాలనలో ఈ తేడాలను గమనించినప్పుడు అవి నిజంగానే రెండు విభిన్నమైన మోడల్స్ అని చెప్పకతప్పదు. దేశప్రజలు ఏ మోడల్ పాలన కోరుకొంటున్నారో తెలియాలంటే 2019 ఎన్నికల వరకు వేచి చూడకతప్పదు. 


Related Post