తెరాసను దెబ్బ తీసేందుకే అయన వస్తున్నారా?

February 05, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం త్వరలో  రాజకీయ పార్టీ (తెలంగాణా జనసమితి) స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం అయన రాజకీయాలలోనే ఉన్నప్పటికీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఏ పార్టీకి మద్దతు పలుకలేదు. కానీ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రతిపక్షనేతలాగ సమస్యలపై తెరాస సర్కార్ తో పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయపార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు కనుక ఇక తెరాస సర్కార్ తో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించవచ్చు. 

తెలంగాణా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రజలకు అయన చాలా దగ్గరయిన మాట వాస్తవం. అయితే రాష్ట్రంలో తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాపులారిటీ పెరిగిపోయింది. దాని ముందు ప్రొఫెసర్ కోదండరాం పాపులారిటీ కాస్త మసకబారిందని చెప్పక తప్పదు. 

పైగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం ద్వారా తెరాస రాజకీయంగా చాలా బలపడింది. తెరాస విసురుతున్న సవాళ్ళను తట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడగలిగింది. మంచి బలమైన క్యాడర్, అపార రాజకీయ అనుభవం ఉన్న తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపాలే వచ్చే ఎన్నికలలో ఏవిధంగా గట్టేక్కాలా...అని ఆలోచనలు చేస్తున్నాయి. కనుక కొత్త రాజకీయ పార్టీతో వస్తున్న ప్రొఫెసర్ కోదండరాం వాటన్నిటి ప్రభావాన్ని అధిగమించి తన పార్టీని గెలిపించుకోవడం చాలా కష్టమే. చిరకాలంగా రాజకీయాలలో ఉన్న ప్రొఫెసర్ కోదండరాంకు ఈవిషయాలన్నీ తెలియవనుకోలేము. తెలిసీ బరిలో దిగుతున్నారంటే ఓట్లు చీల్చి తెరాసను దెబ్బ తీయడానికేననుకోవలసి ఉంటుంది. 

రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్, తెరాసల మద్య చీలిపోయున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, బహుజన వామపక్ష ఫ్రంట్, ఇంకా అనేక చిన్నాపెద్దా పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు అందరూ కూడా బరిలో దిగితే ఓట్లు ఇంకా చీలిపోవడం ఖాయం. ఓట్లు ఎంతగా చీలితే అంతగా అధికార పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

ఈ నేపధ్యంలో ప్రొఫెసర్ కోదండరాం తన ప్రతిష్టను పణంగాపెట్టి రాజకీయ పార్టీ స్థాపించి ప్రజలకు ముందు రాబోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి తనను ఎదుర్కోమని ముఖ్యమంత్రి కెసిఆర్ విసిరిన సవాలును స్వీకరించి ముందుకు వస్తున్న ప్రొఫెసర్ కోదండరాం, అయన విసిరిన ఉచ్చులో చిక్కుకోబోతున్నారా లేక కోదండరాంను రెచ్చగొట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి రప్పించి  అయన చేతిలో కేసీఆర్ (తెరాస) నష్టపోనుందా? అనేది ఎన్నికలొస్తేగానీ తెలియదు.  


Related Post