ఆ పసిపిల్లాడు బ్రాండ్ అంబాసిడర్...గ్రేట్!

February 05, 2018


img

తెలంగాణా రాష్ట్ర సాగునీటిపారుదల శాఖకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? ఐదేళ్ళు వయసున్న నెహాల్ అనే బాలుడు. అతని తల్లితండ్రుల స్వస్థలం ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలోని పందిళ్ళపల్లి గ్రామం. అతని తండ్రి హైదరాబాద్ షాపూర్ నగర్ లో ఒక ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. 

నెహాల్ కు కూడా అందరు పిల్లలలాగే మొక్కలు, ప్రకృతి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి పధకాల గురించి టీవీ ఛానళ్ళలో వస్తున్న వార్తలు, వాటి ప్రయోజనాల గురించి మంత్రులు, అధికారులు చెపుతున్న మాటలు, వాటిపై మీడియాలో జరుగుతున్న చర్చలు...ఆ బాలుడిలో వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచాయి. అది గమనించిన అతని తల్లితండ్రులు రాష్ట్రంలో నిర్మించబడుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి చెప్పసాగారు. ఆ వయసులో పిల్లలకు ఆటపాటలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ నెహాల్ మాత్రం ఆటపాటలతో బాటు సాగునీటి ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపడం విశేషం. అతని తల్లితండ్రులు కూడా అతనిని ప్రోత్సహించడంతో అతనిప్పుడు రాష్ట్రంలో వివిధ దశలలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, వాటి ప్రయోజనాల  గురించి గడగడా చెప్పేస్తున్నాడు. 

ఈ సంగతి తెలుసుకొన్న స్థానిక తెరాస నేతలు ఆ బాలుడిని నిన్న రాష్ట్ర సాగునీటి పారుదలశాఖా మంత్రి హరీష్ రావు వద్దకు తీసుకువెళ్ళారు. ఆ సమయంలో అయన హైదరాబాద్ జలసౌధాలో సాగునీటి ప్రాజెక్టుల గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆ బాలుడు వివరించిన తీరు చూసి మంత్రి హరీష్ రావుతో సహా అందరూ చాలా ముచ్చటపడ్డారు. ఆ బాలుడిని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖాకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అంతేకాదు..ఆ బాలుడి విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును సాగునీటిశాఖే భరిస్తుందని ప్రకటించారు. ఆ బాలుడిని తల్లితండ్రులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకువెళ్ళి చూపించాలని అధికారులను కోరారు. తెలంగాణా రాష్ట్ర సాగునీటి పారుదలశాఖకు బ్రాండ్ అంబాసిడర్ ను మీరూ చూడండి! 


Related Post