టి-కాంగ్రెస్ హడావుడి ఎన్నికల కోసమేనా?

February 05, 2018


img

ఇటీవల నల్లగొండలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ కు టి-కాంగ్రెస్ నేతలు ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసినసభలో నివాళులు అర్పించారు. ఆ సభకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియాతో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ తొత్తులు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారు. హత్యారాజకీయాలకు కూడా వెనుకాడం లేదు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య అందుకు తాజా ఉదాహరణ. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే మేము చూస్తూ ఊరుకోమని ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరిస్తున్నాము,” అన్నారు.

జానారెడ్డి మాట్లాడుతూ, “దాడులు, హత్యా రాజకీయాలతో అధికార పార్టీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. తెరాస నేతలు అధికారమదంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వారి అహంకారాన్ని అణచివేసే సమయం దగ్గరపడింది. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాము,” అని హెచ్చరించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, “ మేము కూడా తెరాస నేతల్లాగ ప్రవర్తిస్తే నాలాలన్నీ శవాలతో నిండిపోతాయి. కానీ మేము గాంధేయ సిద్దాంతం అనుసరించి ప్రజాస్వామ్యబద్దంగా రాజకీయాలు చేస్తున్నాము. మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ ను హెచ్చరిస్తున్నాను. శ్రీనివాస్ హత్యకు తెరాస ఎమ్మెల్యే వీరేశమే కారకుడని మేము చెపుతున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ అతనిని ఎందుకు వెనకేసుకువస్తున్నారు? వీరేశంతో సహా ఈ కేసులో నిందితుల కాల్ డేటాను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?  తెరాస సర్కార్ కు ఈ హత్యతో సంబంధం లేదంటే తక్షణమే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి,” అన్నారు. 

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను గట్టిగా ఖండించేందుకు టి-కాంగ్రెస్ నేతలు అందరూ తరలిరావడం గమనిస్తే, వారు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకొన్నారని అర్ధం అవుతోంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుస్తుందనుకొన్న ప్రతీ అంశాన్ని వారు తెలివిగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ‘ముఖ్యమంత్రి కెసిఆర్ కు దమ్ముంటే నల్లగొండ నుంచి పోటీ చేయాలని’ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సంతాప సభలో సవాలు చేయడం, టి-కాంగ్రెస్ నేతల నోట వినిపించిన విమర్శలు, ఎన్నికల సవాళ్ళు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వారు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేసినవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారా లేక ఈ ఘటనను కాంగ్రెస్ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలనుకొంటున్నారా? అనే అనుమానం కలుగుతోంది. వారి రాజకీయ సవాళ్ళ కారణంగా ఈ సంతాప సభ రాజకీయ సభను తలపించిందని చెప్పకతప్పదు.


Related Post