రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది కనుక వచ్చే ఎన్నికలలో భాజపా సాధించగలిగేదేమి ఉండకపోవచ్చు. కనుక భాజపాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకే ఆర్ధికమంత్రి బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యం కల్పించి, రెండు తెలుగు రాష్ట్రాలకు మొక్కుబడిగా నిధులు విదిలించారు.
తెలంగాణా ప్రభుత్వం మొత్తం రూ.36,000 కోట్లు విలువ గల పనులకు ప్రతిపాదనలు పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని కోరింది. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు ఇంకా వివిధ ప్రాజెక్టులకు నిధులు కోరుతూ తెలంగాణా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.36,000 కోట్లు కోరితే కేవలం అరుణ్ జైట్లీ కేవలం రూ.85 కోట్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. దానిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ములుగు వద్ద జాకారం గ్రామంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.10 కోట్లు, హైదరాబాద్ లో ఐఐటికి రూ. 75 కోట్లు కేటాయించారు. ఒక రాష్ట్రానికి చేసిన బడ్జెట్ కేటాయింపు ఇది అని చెప్పుకోవడం సిగ్గుచేటు.
తెలంగాణాతో పోలిస్తే ఏపికి చేసిన కేటాయింపులు కొంత నయమే కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను బడ్జెట్ లో చోటుదక్కలేదు. ఏపిలో ఐఐటి, ఐఐఐటి, ఐఐఎం, నీట్, ఐఐఎస్‌సీఆర్, ట్రైబల్ యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విశాఖ పోర్టుకు కలిపి మొత్తం రూ.404.62 కోట్లు మంజూరు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వనందున, తెలుగు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది కనుక వారి ఆగ్రహం వలన భాజపాకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదనే ధైర్యంతోనే కేంద్రప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను పట్టించుకోలేదని భావించవలసి ఉంటుంది.