జానారెడ్డి బాగానే చెప్పారు కానీ...

January 31, 2018


img

తెరాస నేతలు రేవంత్ రెడ్డి రాజీనామా కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తారని సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డిని విలేఖరులు అడిగినప్పుడు అయన చాలా లౌక్యంగా సమాధానం చెప్పారు. “రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్దంగానే ఉన్నారు కానీ ఇదివరకు తెరాసలో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలనే స్పీకర్ ఆమోదించనప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తారని నమ్మకం ఏమిటి? అందుకే అయన రాజీనామా చేయలేదు,” అని చెప్పారు. 

జానారెడ్డి చెప్పిన ఈ మాటలు అయన రాజకీయ చతురతకు అద్దం పడుతున్నాయి. తెరాసలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలను ముందుగా ఆమోదింపజేస్తే ఆ తరువాత రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడని జానారెడ్డి చెప్పకనే చెప్పారు. అది సాధ్యం కాదు కనుక ఇదీ సాధ్యం కాదనే అర్ధం. జానారెడ్డి తన పద్దతిలో చాలా సౌమ్యంగా జవాబు చెప్పారు. కానీ ఒకవేళ తెరాస నేతలు మళ్ళీ రేవంత్ రెడ్డి రాజీనామా గురించి పట్టుబడితే, ఈసారి దాసోజు శ్రవణ్ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు ఇదే ముక్కను చాలా ఘాటుగా చెప్పవచ్చు. కనుక తెరాస నేతలు అద్దాల మేడలో కూర్చొని కాంగ్రెస్ నేతలపై ఈ ఒక్క విషయంలో రాళ్ళు విసరకుండా ఉంటేనే మంచిది.


Related Post