మన దేశంలో ఒక విలక్షణమైన ప్రజాస్వామ్య వాతావరణం నెలకొని ఉంది. కొన్ని సందర్భాలలో ఏవేవో కారణాలతో అల్లరి మూకలు విద్వంసానికి పాల్పడినా వారిపై చట్టబద్దంగా ఏమీ చేయలేని నిసహ్హాయత కనిపిస్తుంది. మేధావులని చెప్పుకోబడే కంచె ఐలయ్య వంటివారు సమాజంలో ఒక వర్గం ప్రజలపై విద్వేషం వెళ్ళగ్రక్కుతూ పుస్తకాలు ప్రచురించినా అది భావప్రకటన హక్కు క్రిందకే వస్తుందని న్యాయస్థానాలు పేర్కొంటాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ధర్నా చేసుకొంటామంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అనుమతి నిరాకరించబడుతుంది. దళితులపై దాడులు జరిగితే పట్టించుకొనే నాధుడు ఉండడు. వారికి ఎన్నటికీ న్యాయం జరుగదు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. మనదేశంలో స్వేచ్చా స్వాతంత్ర్యాల గురించి ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ‘అతివృష్టి అనావృష్టి’ అని చెప్పుకోవచ్చు. అతి స్వేచ్చ లేకుంటే నోరు మెదపలేని నిస్సహాయత. ఇదీ మన ప్రజాస్వామ్యం తీరు.
అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మేమున్నామని న్యాయస్థానాలు కొన్నిసార్లు గుర్తు చేస్తుంటాయి. వైశ్యులను ‘సమాజాన్ని దోచుకొనే సామాజిక స్మగ్లర్లు’ అంటూ ఏకంగా పుస్తకమే ప్రచురించిన కంచె ఐలయ్యపై మల్కజ్ గిరికి చెందిన శ్రీకాంత్ గుప్తా అనే వ్యక్తి స్థానిక కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ కేసు విచారణకు హాజరు కావాలని కంచె ఐలయ్యకు రెండుసార్లు కోర్టు నోటీసులు పంపించినా హాజరుకాలేదు. కానీ మూడోసారి నోటీసు పంపడంతో అయన నిన్న కోర్టు విచారణకు హాజరయ్యారు. మళ్ళీ ఈ కేసును ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా పడింది.