అనసూయ ఆవేదన సహేతుకమే...

January 27, 2018


img

గణతంత్రదినోత్సవం సందర్భంగా నిన్న యావత్ దేశం మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. దేశప్రజలు ఉత్సాహంగా ఆ వేడుకలలో పాల్గొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అంతా బాగానే ఉంది కానీ నేటికీ దేశంలో మహిళల అభద్రతాభావంతోనే జీవిస్తున్నారు. వారిపట్ల పురుష సమాజం వ్యవహరిస్తున్న తీరు అక్షేపనీయంగానే ఉంది. సంస్కృతీ సంప్రదాయాల పేరిట మహిళలపై ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి. వాటిని కాదని అడుగు ముందుకు వేసినవారిపై పురుష సమాజం మానసికంగా, వీలైతే భౌతిక దాడులకు పాల్పడుతోంది. “ఇదేనా దేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం?” అని ప్రశ్నిస్తూ సినీనటి అనసూయ ‘డియర్ ఇండియా’ అంటూ దేశప్రజలకు, పాలకులకు శుక్రవారం ఒక బహిరంగ లేఖ వ్రాశారు. 

ఆ లేఖలో అనసూయ ఏమి వ్రాశారంటే, “ఒక కుమార్తెగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా..అందరు మహిళలలాగే నేను నా కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. నా వృత్తి..నేను ధరించే దుస్తులు నా కుటుంబ సభ్యులు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు కానీ ఇతరులకు అభ్యంతరకంగా అనిపిస్తోంది.  ఆ కారణంగా కొంతమంది నన్ను, నా భర్తను, పిల్లలను, తల్లితండ్రులు, కుటుంబసభ్యులను ఉద్దేశ్యించి అవమానిస్తూ, అవహేళన చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజూ నేను అటువంటి అనేక ఫోన్ కాల్స్, మెసేజులు, వ్యాఖ్యలు వింటున్నాను. వేరవరైనా అయితే వాటిని తట్టుకోలేరు కూడా. 

గణతంత్రదినోత్సవం సందర్భంగా ఒక బాధ్యత కలిగిన మహిళగా నేను అడుగుతున్నాను. స్వేచ్చా, స్వాతంత్ర్యం అంటే ఇదేనా? నేను కోరుకొన్నవిధంగా పనిచేసుకోవడానికి నాకు స్వేచ్చలేదు..కానీ సంస్కృతీ సంప్రదాయాలు పేరుతో ఇటువంటి గూండాలకు మాత్రం నా స్వాభిమానాన్ని, నా ఆలోచనలని అణగద్రొక్కేయడానికి స్వేచ్చ ఉందా? జీవితాంతం నేను ఈవిధంగా (వారిని భరిస్తూ)నే జీవించాలా? ఎవరూ ఏమీ చేయలేరా?” అని అనసూయ తన లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.  

అనసూయ ఆవేదన సహేతుకమైనదే. తన పట్ల, తన కుటుంబం పట్ల కొందరు ‘మొగాళ్ళు’ ప్రదర్శిస్తున్న పురుషాహంకారాన్ని ఆమె నిబ్బరంగా ఎదుర్కోవడం చాలా అభినందనీయమే. అయితే ఈ సమస్యకు ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు పరిష్కరించగలవని చెప్పలేము. దీనికి ఏకైక పరిష్కారం బాల్యం నుంచే పిల్లలలో ముఖ్యంగా మగపిల్లలలో తోటి బాలికల పట్ల సమాజంలో మహిళల పట్ల గౌరవభావం పెంపొందింపజేసేవిధంగా మన విద్యావ్యవస్తలో అవసరమైన మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది. 

30-40 ఏళ్ళ తరువాత జరుగబోయే ఒలింపిక్ పోటీలలో పాల్గొనేందుకు ఇప్పటి బాలలను ఏవిధంగా అన్ని దేశాలు తయారుచేసుకొంటున్నాయో, అదేవిధంగా ఇప్పటితరం పిల్లలకు ఇళ్ళలో.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో ‘మహిళలను గౌరవించాలనే విషయం’ వారి లేత బుర్రలలో నాటుకుపోయేలా నేర్పించినప్పుడే కనీసం తరువాత తరం మహిళలు 100 శాతం స్వేచ్చా స్వాతంత్ర్యాలతో జీవించగలుగుతారు. పురుషులతో సమానమైన గౌరవం పొందగలుగుతారు. కానీ సమాజాన్ని సంస్కరించుకొనే ఆసక్తి, ఓపిక మన సమాజానికి ఉందా? సమాధానం అందరికీ తెలుసు. మనమెవరం సమాజాన్ని మార్చలేమనుకొన్నప్పుడు కనీసం మన ఇంటి నుంచే ఆ చిన్న మార్పుకు ప్రయత్నించవచ్చు కదా? అని అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. 


Related Post