ప్రతీ ఏటా తెరాస ప్లీనరీ సమావేశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు గులాబీ కూలి పేరిట రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, చిన్నాపెద్దా దుఖాణాల యజమానుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేసినా తెరాస పట్టించుకోలేదు. తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగం చేసి గులాబీ కూలి పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం, ఈ కేసులో తన అభిప్రాయం తెలుపవలసిందిగా కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ వ్రాసింది.
అధికారంలో ఉన్నవారు ఏ రూపంలో ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసినా తప్పనిసరిగా చట్టపరిధిలోనే చేయవలసి ఉంటుంది. కానీ తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు గులాబీ కూలి పేరుతో దుఖాణాలలో చీరలు, ఛాయ్, జ్యూస్ వంటివి అమ్మడం, ఆసుపత్రులలో చీపురు పట్టుకొని మీడియాకు ఫోజులిచ్చి అందుకు ప్రతిగా వేలు లక్షలు ‘గులాబీ కూలి’ సంపాదించామని వారు గొప్పగా చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దానినే ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొన్నట్లయితే, తెరాస సర్కార్ కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు.