హాకీలో భారత్‌కు మరో కాంస్యం

August 08, 2024
img

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరి భారత్‌ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనూహ్యంగా అనర్హతవేటు పడటంతో షాక్ అయిన భారత్‌కు మన హాకీ టీమ్‌ స్పెయిన్ జట్టుని ఓడించి కాంస్య పతకంతో చాలా ఊరట కలిగించింది.

ఈరోజు పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌-స్పెయిన్ జట్లు హోరాహోరీగా పోరాడుతూ సమ ఉజ్జీలుగా నిలిచాయి. తొలుత స్పెయిన్ ఒక గోల్ చేసి భారత్‌ జట్టుపై ఆధిక్యం సాధించింది. కానీ అప్పటి నుంచి భారత్‌ జట్టు చెలరేగిపోయి స్పెయిన్ గోల్ పోస్టుపై పదేపదే దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.

స్పెయిన్ తెరుకునేలోగానే భారత్‌ పెనాల్టీ కార్నర్‌తో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ జట్టు ఎంతగా ప్రయత్నించినా భారత్‌ డిఫెండర్స్ వారిని ముందుకు సాగనీయకుండా కట్టడి చేయడంతో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో ఆట ముగిసే సమయానికి భారత్‌ 2-1 తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించి కాంస్య పతకం భారత్‌కు సంపాదించి పెట్టింది. 

2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ హాకీ జట్టు కాంస్యం సాధించింది. మళ్ళీ ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌లో కూడా కాంస్యం సాధించడంతో భారత్‌ ప్లేయర్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన శ్రీజేష్ ఈ ఒలింపిక్స్‌ తర్వాత తన కెరీర్‌ను ముగిస్తానని ముందే చెప్పారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో ఆ ముగింపు పలికారు. భారత్‌ జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌లో మైదానంలో ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తుంటే అది చూస్తున్న భారతీయులు కూడా భావోద్వేగానికి లోనై ఉండే ఉంటారు. 

Related Post