అమెరికా ప్రభుత్వ ‘షట్ డౌన్’ ముగిసినట్లేనా?

January 23, 2018
img

అమెరికాలోని అధికార ప్రతిపక్ష పార్టీలైన రిపబ్లికన్, డెమొక్రాట్ల మద్య రాజీ కుదరడంతో వచ్చేనెల 8వ తేదీ వరకు ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదల కోసం నిర్దేశించబడిన ద్రవ్య వినిమయ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది. దానిపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో ఆ బిల్లు ‘తాత్కాలికంగా’ అమలులోకి వచ్చింది. దాంతో మూడు రోజుల శలవు అనంతరం సోమవారం నుంచి మళ్ళీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకొన్నాయి. 

తల్లితండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన పిల్లలు (డ్రీమర్స్) ట్రంప్ సర్కార్ వెనక్కు త్రిప్పి పంపడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికే డెమొక్రాట్స్ ఈ బిల్లును నిలువరింపజేశారు. ట్రంప్ సర్కార్ ఇచ్చిన హామీలతో మెత్తబడిన డెమొక్రాట్స్ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సహకరించారు. అయితే దాంతో కేవలం మూడు వారాలపాటు మాత్రమే ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులను ఖజానా నుంచి తీసి ఖర్చుచేసుకోగలదు. ఆలోగా డెమొక్రాట్స్ సూచించిన సవరణలతో కూడిన ‘కొత్త వలసదారుల బిల్లు’ను ట్రంప్ సర్కార్ అమెరికన్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. 

ఒకవేళ దానిలో ‘డ్రీమర్స్’ హక్కులకు భంగం కలిగేవిధంగా ట్రంప్ సర్కార్ ఏమైనా ఆంక్షలు చేర్చినట్లయితే, డెమొక్రాట్స్ మళ్ళీ ద్రవ్య వినిమయ బిల్లుకు బ్రేకులు వేసే అవకాశం ఉంది. అదే జరిగితే మళ్ళీ ‘షట్ డౌన్’ ప్రకటించి ప్రభుత్వ కార్యాలయాలు మూసుకోక తప్పదు. కనుక మళ్ళీ అటువంటి సమస్య పునరావృతం కాకుండా ట్రంప్ సర్కార్ డ్రీమర్స్ విషయంలో వెనక్కు తగ్గుతుందా లేదా అనేది ఫిబ్రవరి మొదటివారంలో తెలుస్తుంది. 

Related Post