ఏఆర్ రహమాన్ ఎలాంటి వారంటే... బుచ్చిబాబు

May 16, 2026


img

బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో ‘పెద్ది’ చాలా భారీ అంచనాలతో జూన్‌ 4న విడుదల కాబోతోంది. ఈ నెల 18న ముంబాయిలో పెద్ది ట్రైలర్‌, 23న భోపాల్‌లో ‘స్పెషల్ సాంగ్‌’ విడుదల కాబోతున్నాయి. ఆలోగా బుచ్చిబాబు ఖాళీగా కూర్చోలేదు. మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించి, ‘పెద్ది’ గురించి ఆసక్తికరమైన అనేక విషయాలు వెల్లడిస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం అందించిన ఏఆర్ రహమాన్ గురించి మాట్లాడుతూ, “ఆయన నా అభిమాన సంగీత దర్శకుల్లో ఒకరు. నేను సినీ పరిశ్రమలో ప్రవేశించాలని అనుకున్నప్పటి నుంచి ఆయనతో సినిమా చేయగలిగితే అదృష్టమే అనుకునేవాడిని. కానీ అయన ఎవరికీ ఫోన్లో కూడా అందుబాటులో ఉండరని విన్నాను. అలాంటి దర్శకుడుతో సినిమా చేయడం చాలా కష్టమనే అనుకున్నాను. కానీ పెద్దికి సిద్ధమైనప్పుడు ఒకసారి ప్రయత్నిస్తే తప్పేమిటి? అనుకొని నా సినిమాకి చేస్తారా? అని ధైర్యం చేసి అడిగేశాను. ఆయన ఓకే అన్నా నాకు నమ్మకం కలగలేదు. ఎవరికీ అందుబాటులో ఉందని అయనతో ఈ సినిమా ఎలా పూర్తి చేయాలా? అని అనుకుంటే, ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ కి నాకంటే 10 నిమిషాలు ముందే వచ్చేసేవారు లేదా చెప్పిన సమయానికల్లా వచ్చేసేవారు. అంత పెద్ద సంగీత దర్శకుడైన ఏమాత్రం భేషజం ఉండదు ఆయనకి. అయన ఇచ్చిన రెండు మూడు ట్యూన్స్ నేను అనుకున్నట్లు లేవు మార్చాలని చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా కొత్త ట్యూన్స్ ఇచ్చారు. అంత పెద్దాయనికి నేను ఆవిధంగా చెప్పడం సబబో కాదో అని నేను కూడా ఆలోచించలేదు.

కానీ అయన ఇచ్చిన మాస్ బీట్స్, ఇచ్చిన ట్యూన్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతాయి. ప్రతీరోజూ స్టూడియోకి రాగానే నేను మొదట ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టిన తర్వాతే మాట్లాడేవాడిని మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మరోసారి దణ్ణం పెట్టేవాడిని.

అప్పుడు ఆయనేమనే వారంటే మీలాంటి అభిమానులే నా సంగీతానికి ప్రాణం. మీ అభిమానమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పేవారు. ఏమాత్రం భేషజం లేకుండా అయన నాతో పనిచేసిన తీరు జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను,” అని బుచ్చిబాబు చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష