బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్‌ కుదర్దు: హైకోర్టు

May 16, 2026


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు హైకోర్టులోనిరాశ తప్పలేదు. పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న అతనికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేమని హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీ దేవి స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పేట్ బషీరాబాద్‌ పోలీసులు బండి భగీరథ్‌కు నోటీసులు ఇచ్చారు. 

కానీ ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునందున విచారణకు హాజరు కాలేదు. ఈ నేపధ్యంలో న్యాయమూర్తి శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు అతని పిటిషన్‌పై విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విని, పోలీసులు సమర్పించిన బాలిక వాంగ్మూలం కూడా పరిశీలించిన తర్వాత ఈ దశలో బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని చెపుతూ ఈ కేసు తదుపరి విచారణని వారం రోజులకు వాయిదా వేశారు. 

కనీసం అంత వరకు పోలీసులు బండి భగీరథ్‌ని అరెస్ట్ చేయకుండా ఆదేశించాలనే పిటిషనర్‌ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి అభ్యర్ధనకి న్యాయమూర్తి అంగీకరించలేదు. కానీ కేసు తదుపరి విచారణను కాస్త ముందుగా నిర్వహించి అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలా వద్దా అనేది చెపుతామని న్యాయమూర్తి హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌కు చెందిన మైనర్ బాలికని న్యూఇయర్ వేడుకల కోసం డిసెంబర్‌ 31న ఫామ్‌హౌసుకి తీసుకువెళ్ళి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేసినట్లు బాలిక, తల్లితండ్రుల పిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్‌ పోలీసులు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలు జరిగే సమయానికి ఆమె ‘మైనర్’ అని నిరూపించే పత్రాలను పోలీసులు న్యాయమూర్తికి సమర్పించారు.   

కానీ అప్పటికి వారిరువురూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అందుకే ఆమె ఫామ్‌హౌసుకి వెళ్ళిందని, అక్కడ ఆమె ఇష్టపూర్వకంగానే మద్యం తాగిందని లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. వారు బ్రేకప్ అయిన తర్వాత కూడా చాలా సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని తెలిపారు. 

ఈ ఘటనలు గత ఏడాది డిసెంబర్‌ 31న జరిగితే ఈ ఏడాది మేలో కేసు వేయడం, బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు కేసులో కొత్త సెక్షన్స్ జోడించడం వంటివి రాజకీయ ఒత్తిళ్ళు, దురాలోచనతో చేసినవేనని లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు.     

ఈ నేపధ్యంలో బండి భగీరథ్‌ విచారణకు హాజరవుతాడా లేక తదుపరి విచారణ జరిగే వరకు అజ్ఞాతంలోనే ఉంటాడా? నేడు తెలియవచ్చు. 


Related Post