ఇటీవల హైదరాబాద్‌లో విశ్రాంత అధికారి భార్యని వారి ఇంట్లో పనిచేసే నేపాలీ మహిళ కల్పన హత్య చేసి డబ్బు, బంగారంతో పారిపోయిన ఘటనపై ఇంకా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగానే, సికింద్రాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. కానీ పోలీసులకు పట్టుబడ్డారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం సికింద్రాబాద్ జవహార్ నగర్‌లోని కౌకూర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68), అయన భార్య డాక్టర్ విజయలక్ష్మీ (58) నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లో ఓ నేపాలీ జంట పని చేస్తున్నారు.
ఈ నెల 12న తన భార్య మమత పుట్టిన రోజని, అనుమతిస్తే సాయంత్రం పని ముగిసిన తర్వాత వారి ఇంట్లోనే కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకుంటామని ఆమె భర్త రమేష్ వారిని కోరాడు. అందుకు వారు అంగీకరించారు.
సమీపంలోనే తమ బంధువులు నలుగురున్నారని వారిని కూడా అనుమతించమని కోరగా ఆ దంపతులు అంగీకరించారు.
అయితే రమేష్, మమత వారందరితో కలిసి తమ ఇంట్లో డబ్బు, బంగారం దోచుకోవడానికే ఈ పుట్టిన రోజు డ్రామా ఆడారనే విషయం ఆ దంపతులు చాలా ఆలస్యంగా గ్రహించారు.
రమేష్, మమత బంధువులమంటూ ఇంట్లోకి ప్రవేశించిన నేపాలీ గ్యాంగ్ ఆ దంపతులు ఇరువురినీ కుర్చీలలో తాళ్ళతో కట్టేసి ఇంట్లో ఉన్న దాదాపు 75 తులాల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు, రూ. 30,000 నగదు, మరో 3,000 అమెరికన్ డాలర్లు దోచుకొని పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్, ఆ దంపతులు చెప్పిన వివరాలు ఆధారంగా గాలింపు మొదలుపెట్టి ఆ నేపాలీ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు.
వారి గ్యాంగులో రమేష్, మమతలతో సహా మొత్తం 8 మంది ఉన్నారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.