రజనీ వందసార్లు చెపితే....

December 26, 2017


img

“నేను ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్లు లెక్క” అనే రజనీకాంత్ పాపులర్ డైలాగ్ అందరూ వినే ఉంటారు. కానీ నిజజీవితంలో మాత్రం దానిని తిరగేసి, “నేను వందసార్లు చెపితే ఒక్కసారి చెప్పినట్లు లెక్క” అని చెప్పుకోవలసివస్తోంది. పైగా దానికి మరో డైలాగ్ కూడా కలిపి చెప్పుకోవలసివస్తోంది. తన రాజకీయ ప్రవేశం గురించి ఎవరు ప్రశ్నించినా ఆయన “పైనున్న ఆ దేవుడు శాశిస్తే క్రిందున్న ఈ రజనీ దానిని పాటిస్తాడు,” అనే డైలాగ్ ను అయన వందకంటే ఎక్కువసార్లే చెప్పి ఉంటారేమో.

ఈరోజు కూడా మళ్ళీ అయన ఆ డైలాగ్ మరోసారి చెప్పారు. ఆయన చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో తన అభిమానులతో మంగళవారం సమావేశమైనప్పుడు ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేవుడు శాసిస్తే నేను తప్పకుండా రాజకీయాలలోకి వస్తాను. రాజకీయాలు నాకు కొత్తేమి కాదు. కానీ నేను రాజకీయాలలోకి ప్రవేశించడం వలన ప్రజలకు ఏమేరకు మేలు చేయగలననే ఆలోచిస్తున్నాను. అందుకే ఆలస్యం అవుతోంది. యుద్దంలో దిగితే తప్పకుండా విజయం సాధించాలి. యుద్ధం అంటే సార్వత్రిక ఎన్నికలని నా ఉద్దేశ్యం. ఆ యుద్ధం జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినా దానిని ఎదుర్కోవడానికి అందరం సిద్దంగా ఉందాం. నేను తప్పకుండా రాజకీయాలలోకి వస్తానని ఇప్పుడు చెప్పడం లేదు. కానీ నా రాజకీయ ప్రవేశంపై డిసెంబర్ 31న నిర్దిష్టంగా ప్రకటిస్తాను,” అని చెప్పారు.

రజనీకాంత్ కనీసం ఇప్పటికైనా తన రాజకీయ ప్రవేశం గురించి డిసెంబర్ 31న నిర్దిష్టంగా ప్రకటిస్తానని చెప్పినందుకు అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఆరోజున మళ్ళీ ఏదో మెలిక పెట్టి మాట్లాడకుండా నిర్దిష్టంగా ప్రకటించి రెండు దశాబ్దాల ఈ సస్పెస్ రాజకీయాలకు తెర దించుతారని ఆశిద్దాం. 


Related Post