రేవంత్..అంత దూకుడు ఎందుకు?

December 26, 2017


img

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మంత్రి లక్ష్మారెడ్డికి మద్య మొదలైన మాటల యుద్ధం నానాటికీ తీవ్రం అవుతోందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. “ప్రధాని మోడీ పట్ల అనుచితంగా మాట్లాడినందుకు సీనియర్ కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు, అటువంటి తప్పే చేసిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తోంది?” అని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. 

దానిపై కాంగ్రెస్ పార్టీ కంటే ముందే రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “నాపై చర్య తీసుకోవాలని మా పార్టీని కోరేముందు, మీ మంత్రి లక్ష్మారెడ్డి నాగురించి ఏమన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది,” అని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మళ్ళీ మంత్రి లక్ష్మారెడ్డిని ఉద్దేశ్యించి చాలా అనుచితమైన బాషలో దుర్భాషలాడటాన్ని బహుశః కాంగ్రెస్ పార్టీ కూడా హర్షించకపోవచ్చు. 

ఈ వ్యవహారంలో మంత్రి కేటిఆర్ తో సహా తెరాస నేతలందరూ మంత్రి లక్ష్మారెడ్డికి అండగా నిలబడి రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నప్పటికీ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా ఏ ఒక్క టి-కాంగ్రెస్ నాయకుడు ముందుకు వచ్చి రేవంత్ రెడ్డికి అండగా నిలబడకపోవడం గమనిస్తే, కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రెడ్డి మాటలతో, బాషతో విభేదిస్తున్నట్లే చెప్పవచ్చు. ఇంతకు ముందు కేటిఆర్ మావగారు హరనాథ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు కూడా టి-కాంగ్రెస్ నేతలు ఎవరూ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడకపోవడం గమనార్హమైన విషయమే. 

ముఖ్యమంత్రి కెసిఆర్, తెరాస సర్కార్ పై మాటల యుద్ధం చేయడంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీలో అయన కంటే చాలా సీనియర్స్, అనేకమంది కొమ్ములు తిరిగిన హేమాహేమీలున్నారు. వారిలో చాలా మంది పిసిసి అధ్యక్ష పదవినో లేక రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని కోరుకొంటున్నవారున్నారు. 

పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం అటువంటి పదవులు ఏవీ ఆశిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వనప్పటికీ, అయన ఆ ఉద్దేశ్యంతోనే ఇంత ‘అతి’ చేస్తున్నారనే భావన సీనియర్ నేతలలో కలగడం సహజమే. బహుశః అందుకే పార్టీలో ఎవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని భావించవచ్చు. 

టి-తెదేపా, టి-కాంగ్రెస్ పార్టీలలో పూర్తిగా విభిన్నమైన పరిస్థితులున్నాయి. తెదేపాలో ధైర్యంగా కెసిఆర్ ను డ్డీ కొనేవారు ఎవరూ లేనందున రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడినా ఎవరూ అభ్యంతరాలు చెప్పేవారు కారు. కానీ టి-కాంగ్రెస్ లో కొమ్ములు తిరిగిన సీనియర్ నేతలు అనేకమంది ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించడానికి వారిలో ఎవరూ భయపడేవారు కారు. కనుక రేవంత్ రెడ్డి తన సహజశైలిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను, తెరాస సర్కార్ ను విమర్శిస్తున్నప్పటికీ, దాని వలన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కూడా ఆగ్రహం కలిగిస్తున్నానని గ్రహిస్తే మంచిదేమో? లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. 


Related Post