భారతరత్న అయితేనేమిటి?

December 22, 2017


img

రెండు రాష్ట్రాలలో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీపై ఎదురుదాడి చేస్తూ ఉభయసభలను స్తంభింపజేస్తోంది. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన సచిన్ టెండూల్కర్ నిన్న సభలో మాట్లాడబోతుంటే కాంగ్రెస్ సభ్యులే అడ్డుకొన్నారు. కుంటిసాకులతో సమావేశాలు జరుగకుండా అడ్డుకోవడమే తప్పనుకొంటే, తాము నామినేట్ చేసిన సభ్యుడు మాట్లాడబోతుంటే ఆయనను అడ్డుకోవడం మరో పొరపాటు. అది చాలదన్నట్లు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ‘క్రికెట్ దేవుడి’గా కొలిచే సచిన్ టెండూల్కర్ ను కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి విమర్శించడం మరో ఘోరమైన తప్పిదం. 

“మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ  సభలో క్షమాపణలు చెప్పాలని మేము కోరుతుంటే మద్యలో అయన మాట్లాడేందుకు లేచినిలబడ్డారు. ఆయనకు భారతరత్న అవార్డు లభించినంత మాత్రాన్న పార్లమెంటులో మాట్లాడేందుకు ప్రత్యేక లైసెన్స్ ఇచ్చినట్లు కాదు కదా? ప్రధాని మోడీ సభలో బేషరతుగా క్షమాపణలు చెప్పేవరకు సభను జరుగనివ్వం,” అన్నారు ఎంపి రేణుకా చౌదరి. 

సచిన్ టెండూల్కర్ కు దేశంలో ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు. పైగా ఆయన ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు గ్రహీత. అటువంటి వ్యక్తి సభలో మాట్లాడబోతే ఆయనను నామినేట్ చేసిన కాంగ్రెస్ పార్టీయే అడ్డుకోవడం మళ్ళీ ఈవిధంగా అయన పట్ల అనుచితంగా మాట్లాడం చాలా బాధాకరం. ఇప్పటికే దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని చాలాసార్లు తిరస్కరించారు. అయినా దాని తీరుమార్చుకోలేదు. సచిన్ టెండూల్కర్ పై నోరు పారేసుకొన్నందుకు అయన అభిమానులు ఏదో ఒకరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకుండా ఉంటారా? అయనపై రేణుకా చౌదరి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించవలసివస్తే ఆశ్చర్యం లేదు.


Related Post