అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్: తెలంగాణా!

December 21, 2017


img

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు చేపట్టి అమలుచేస్తుండటం సర్వసాధారణమైన విషయమే. అయితే అందుబాటులో ఉన్న వనరులను, అలాగే అవసరాలను సరిగ్గా గుర్తించి తదనుగుణంగా ప్రభుత్వ పధకాలను, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించుకొని, వాటినే అంత చిత్తశుద్ధిగా అమలుచేసే ప్రభుత్వాలను వేళ్ళపైనే లెక్కించవచ్చు. అటువంటి రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఒకటని చెప్పవచ్చు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక మునుపే రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్దం చేసుకొని కలలుకన్న కెసిఆర్ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ అమలుచేయడం మొదలుపెట్టారు. 

అందుకోసం ఆయన సరైనవ్యక్తులను ఏరికోరి ఎంపిక చేసుకోవడం ద్వారా మొదటే సగం విజయం సాధించారు. ‘టీమ్-బంగారీ తెలంగాణా’ ను ఏర్పాటు చేసుకొన్నాక అందరికీ బాధ్యతలు అప్పగించి ఒకేసారి సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలలో ప్రతిపక్షాల నుంచి ఎన్ని సవాళ్లు, విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకే సాగుతున్నారు. ఆ చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం కారణంగానే అనతికాలంలోనే సత్ఫలితాలు కనబడటం మొదలయ్యాయి.  

ముందుగా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోవడం బాగుంటుంది.

తెలంగాణా ఏర్పడగానే మొట్ట మొదటగా చిరకాలంగా పట్టి పీడిస్తున్న విద్యుత్ కొరత సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. భవిష్యత్ లో మళ్ళీ అటువంటి సమస్య ఏర్పడకుండా ధర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇతరరాష్ట్రాలతో విద్యుత్ సరఫరాకు ఒప్పందాలు కూడా చేసుకొన్నారు. భవిష్యత్ లో రెప్పపాటు సేపు విద్యుత్ నిలిచినా అదే వార్తవుతుందన్న కెసిఆర్ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి.

ఆ తరువాత జిల్లాల పునర్విభజన కార్యక్రమం సజావుగా పూర్తి చేసి అన్ని జిల్లా కేంద్రాలలో సమీకృత కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టారు. వాటిలో కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి కూడా. అలాగే రాష్ట్రంలో మారుమూల కూడా విద్యుత్ సరఫరా, రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువలు, ప్రాధమిక ప్రభుత్వ పాఠశాలలలో మౌలికవసతుల కల్పన, ప్రాధమిక ఆసుపత్రులు వంటి అనేక మౌలిక సదుపాయాల కల్పనకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 

అలాగే భూరికార్డుల ప్రక్షాళన, పంచాయితీ రాజ్ చట్టంలో సంస్కరణలు, కొత్తగా గ్రామ పంచాయితీల ఏర్పాటు, తెలంగాణా రైతు సమన్వయసమితిల ఏర్పాటు వంటి అనేక సంస్కరణలు వివిధ దశలలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.   

ఇక రాష్ట్రంలో నీటి అవసరాలు, లభ్యతపై మంచి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి ఏకకాలంలో అనేక ఎత్తిపోతల పధకాలు, కాలువల నిర్మాణం, బ్యారేజీలు యుద్ధప్రాతిపదికన చేయిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

సాగునీరు అందించడంతో బాటు మిషన్ కాకతీయ పధకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది చెరువులలో పూడిక తీయించి, వీలున్న చోట వాటినీ ఈ ప్రాజెక్టుల ద్వారా రీ-ఛార్జ్ చేస్తున్నారు. పూడిక తీయడం వలన ఇప్పుడు చాలా గ్రామాలలో చెరువులలో నీళ్ళు నిండి జలకళతో కళకళలాడుతున్నాయి. ఆ కారణంగా పరిసర ప్రాంతాలలో భూగర్భ నీటి మట్టాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ చెరువుల ద్వారా పంటలకు సాగునీరు అందించడమే కాకుండా వాటిలో చేపపిల్లలను విడిచిపెట్టి మత్సకారులకు ఉపాదిమార్గం చూపడం విశేషం. 

మిషన్ భగీరధ ద్వారా రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ స్వచ్చమైన త్రాగునీరు అందించడానికి చాలా చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్న సంగతి అందరూ చూస్తూనే ఉన్నారు. పైప్ లైన్ వేయడం కోసం త్రవ్వుతున్న ఆ కాలువలలోనే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కూడా వేయాలనే ఆలోచన అమోఘం. తద్వారా ఖర్చు తగ్గించుకోవడమే కాక మిషన్ భగీరధ పూర్తయ్యే సమయానికి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ తో అనుసంధానం చేయడం సాధ్యపడుతుంది. 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోంది. పారిశ్రామిక ప్రగతికి అవరోధంగా నిలుస్తున్న అనేక నిబంధనలను సరళీకరించడం, అనవసరమైనవి పూర్తిగా తొలగించడం, ప్రతీ రంగానికి వేర్వేరుగా నూతన, సరళమైన ఆకర్షనీయమైన పాలసీలను ప్రకటించడం, వివిధ రకాల ఉత్పత్తుల తయారీ కోసం ప్రత్యేకంగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయడం వంటి అనేక చర్యల వలన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తరలివస్తున్నాయి. ఈ కారణంగానే కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే తెలంగాణా రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకులలో అగ్రస్థానానికి చేరుకోగలిగింది. గత ఏడు దశాబ్దాలుగా చూడని అభివృద్ధిపనులు ఈ 42 నెలలలోనే కళ్ళకు కట్టినట్లు కనబడుతుండటం అందరికీ తెలుసు. వాటి గణాంకాలు, సాంకేతిక వివరాలు కూడా వ్రాయాలంటే ఒక పెద్ద పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది. సశేషం...   


Related Post