మోత్కుపల్లి సార్..అప్పుడు గుర్తుకు రాలేదా?

December 21, 2017


img

టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు హటాత్తుగా ఇవ్వాళ్ళ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు కూర్చొన్నారు. ఎస్సీ వర్గీకరణలో తెరాస సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఈరోజు మౌనదీక్షకు కూర్చొన్నారు. తెదేపా నేతలు అక్కడకు వచ్చి మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు. ఈ సంగతి తెలుసుకొన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఆయనతో సహా అక్కడున్న మరికొందరు నేతలను కూడా అదుపులోకి తీసుకొని రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సీ వర్గీకరణ కోసం తాను ఉద్యమిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని పోలీసులను పెట్టి అణచివేయాలని ప్రయత్నించడం చాలా దుర్మార్గమని మోత్కుపల్లి అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగేవరకు తన పోరాటం ఆగదని అన్నారు. వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళతాని శాసనసభలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని నిలబెట్టుకోవాలని మోత్కుపల్లి కోరారు. 

మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు గట్టిగా హామీ ఇవ్వడం చేత గత మూడేళ్ళుగా అయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ 42 నెలలు గడిచినా గవర్నర్ పదవి రాకపోవడంతో, దాని కోసం ఇంకా మడికట్టుకొని కూర్చొంటే రాజకీయంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించినందునే మోత్కుపల్లి మళ్ళీ యాక్టివ్ అయినట్లున్నారు. కనుక అయన చేస్తున్న ఈ హడావుడి మళ్ళీ తనను తాను రాజకీయంగా ప్రమోట్ చేసుకోవడానికే తప్ప ఎస్సీ వర్గీకరణ కోసం కాదని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణాలో తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది కనుక  మరికొన్ని నెలలు ఇలాగే ఏదో ఒక పేరుతో హడావుడి చేసి, తన ‘బ్రాండ్ వాల్యూ’ పెంచుకొని వేరే ఏదో ఒక పార్టీలో చేరిపోవడం ఖాయమనే చెప్పవచ్చు. రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఏదో ఒక కొత్త సమస్యను సృష్టించి హడావుడి చేస్తూ ప్రజల మద్య చిచ్చుపెట్టడం తద్వారా ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడం శోచనీయం. 


Related Post