సంచలనం సృష్టించిన 2జి స్పెక్టం కుంభకోణం కేసును విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఇంకా సంచలనమైన తీర్పు చెప్పింది. సుమారు ఆరేళ్లుగా ఈ కేసును విచారించిన డిల్లీలోని పాటియాలా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా పేర్కొనబడిన మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా, డిఎంకె ఎంపి కనిమొళితో సహా అందరూ నిర్దోషులేనని ప్రకటించింది. వారిని దోషులుగా నిరూపించడానికి సిబిఐ సరైన ఆధారాలు చూపలేకపోయిందని ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని సిబిఐ, ఈడి న్యాయవాదులు మీడియా ప్రతినిధులకు చెప్పారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలలో ఈ 2జి స్పెక్టం ఒకటి. 2జి స్పెక్టం కేటాయింపులలో జరిగిన బారీ అవినీతి, అక్రమాల కారణంగా కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని అప్పటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. కనుక ఈ బారీ కుంభకోణంపై లోతుగా దర్యాప్తు జర్పించి దోషులపై కటినచర్యలు తీసుకోవలసిందిగా కాగ్ సూచించింది. అప్పుడు ప్రధానిగా వ్యవహరిస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్, ఏ.రాజాను పదవిలో నుంచి తప్పించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు.
సిబిఐ, ఈడి లోతుగా దర్యాప్తు జరిపి 2011లో ఏ.రాజా, ఎంపి కనిమొళితో సహా మొత్తం 17మంది నేతలు, కొన్ని కార్పోరేట్ సంస్థల అధినేతలు, అధికారులపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్-షీట్లు దాఖలు చేయడంతో వారిలో ఏ.రాజా, ఎంపి కనిమొళితో సహా మరికొందరు తీహార్ జైల్లో కొన్ని నెలలు గడిపి బెయిల్ పై బయటపడ్డారు. ఈ కేసులో వారు అవినీతికి పాల్పడినట్లు రుజువు చేసేందుకు సిబిఐ ఏకంగా 80,000 పేజీలున్న సాక్ష్యాధారాలను సమర్పించింది. కాగ్ నివేదికను కూడా సమర్పించింది. గత ఆరేళ్ళుగా ఈ కేసుపై తన వాదనలను బలంగా వినిపిస్తూనే ఉంది. కానీ చివరికి కోర్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటించడం చూసి దేశప్రజలు కూడా షాక్ కు గురయ్యి ఉంటారు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును తప్పు పట్టలేము కానీ అందరూ నిర్దోషులే అయితే మరి రూ.1.76 లక్షల కోట్లు నష్ట్రానికి ఎవరు భాద్యులు? అనే ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు? ఆ నష్టాన్ని ఎవరు భరించాలి?