తెరాసకు కూడా అగ్నిపరీక్ష తప్పదేమో?

December 20, 2017


img

గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపద్యంలో 2019లో తెలంగాణాలో జరుగబోయే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉండబోతోందనే ఆలోచనలు కలగడం సహజమే. ముందుగా అధికారంలో ఉన్న తెరాస గురించి ఆలోచిస్తే, దానికి చాలా బలమైన నాయకత్వం ఉంది. మంచి వాక్చాతుర్యం, సామార్ద్యం కలిగిన బలమైన నాయకులు ఉన్నారు. ఈ 42 నెలలలో అది చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లున్నారు. ఏపిలో తెదేపా, భాజపాలు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తెదేపా సర్కార్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేంద్రం, తెరాసతో ఎటువంటి మిత్రత్వం లేకపోయినప్పటికీ తెరాస సర్కార్ పనితీరుపట్ల చాలాసార్లు బహిరంగంగానే సంతృప్తి వ్యక్తం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కారణంగానే ఇప్పుడు డిల్లీలో తెరాసకున్న ప్రాధాన్యత తెదేపాకు కనబడకపోవడం అందరూ గమనించే ఉంటారు. 

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరేదీ తెరాసకు గట్టిపోటీ ఇవ్వలేని దుస్థితిలో ఉండటం కూడా తెరాసకు కలిసివచ్చే అంశమే. తెరాస సర్కార్ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నప్పటికీ దాని నియంతృత్వ పోకడలు, అప్రజాస్వామిక విధానాల పట్ల వ్యతిరేకత కనబడుతోంది. అయితే ప్రజల ఆకాంక్షల మేరకు చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను చూపిస్తున్న కారణంగా దానిలో ఈ రెండు లోపాలను ప్రజలు పట్టించుకోకపోవచ్చు. ఇక 42 నెలలు గడిచిపోయినా నేటికీ రాష్ట్రంలో ఆగని రైతన్నల ఆత్మహత్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, ఉద్యోగాల భర్తీ ఇతర హామీల అమలులో జాప్యం లేదా ప్రభుత్వ వైఫల్యం వంటి లోపాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తోంది కనుక తెరాస అధిష్టానం వాటిపై దృష్టి సారించడం చాలా అవసరమే. 

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు తమకు చాలా అనుకూలంగా ఉన్నాయనే ధీమా తెరాస సర్కార్ లో కనిపిస్తోంది. గుజరాత్ లో పాతుకుపోయిన భాజపా సర్కార్ కూడా అదేవిధంగా ధీమా ప్రదర్శిస్తే కాంగ్రెస్ పార్టీ దానిని ఏవిధంగా ముప్పతిప్పలు పెట్టి ముచ్చెమటలు పట్టించిందో అందరూ చూశారు. కనుక ధీమా ఎక్కువైతే వచ్చే ఎన్నికలలో తెరాసకు కూడా అటువంటి అనుభవమే ఎదురైనా ఆశ్చర్యం లేదు. 

ఇక గుజరాత్ లో మంచి ఫలితాలను సాధించి చూపిన “రాహుల్-టీం” అక్కడ ఏర్పడిన లోపాలను సరిదిద్దుకొని తెలంగాణాకు సరిపడా ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసుకోవడం ఖాయం. తెరాస సర్కార్ పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని, రాష్ట్రంలో కాంగ్రెస్ కున్న అవకాశాలను, తమ పార్టీ నేతల స్వీయ శక్తిసామర్ధ్యాలను ఉపయోగించుకొంటూ వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు అది చాలా గట్టిగా పోరాడటం ఖాయం. పైగా ఇప్పటికే ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని ఫిరాయింపుల కారణంగా చాలా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ, వచ్చే ఎన్నికలలో కూడా ఓడిపోతే నామరూపాలు లేకండా పోయే ప్రమాదం ఉంది. వచ్చే ఎన్నికలు దానికి జీవన్మరణ సమస్య వంటివి కనుక తెరాసకు ఊహించని స్థాయిలో గట్టిపోటీ ఈయవచ్చు. 


Related Post