భాజపా ఆత్మపరిశీలన చేసుకొంటే మంచిది

December 20, 2017


img

గుజరాత్ ఎన్నికలలో భాజపా నామమాత్రపు సీట్లతో విజయం సాధించడంపై తెరాస ఎంపి జితేందర్ రెడ్డి స్పందిస్తూ, “ఈ ఫలితాలను బట్టి చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గట్టెక్కడానికి భాజపా చాలా కష్టపడవలసి ఉంటుందనిపిస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో గెలుపును మోడీ విధానాలకు ప్రజామోదంగా భాజపా చెప్పుకొంటున్నప్పటికీ, గుజరాత్ ఫలితాలను గమనిస్తే ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారని అర్ధం అవుతోంది. ముఖ్యంగా జి.ఎస్.టి. వలన నష్టపోయిన వ్యాపారవర్గాలు ఈ ఎన్నికల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని చెప్పవచ్చు. అదీగాక గుజరాత్ లో చిరకాలంగా భాజపా ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రజలలో సహజంగానే దానిపట్ల కొంత వ్యతిరేకత, అసంతృప్తి నెలకొని ఉంటాయి. బహుశః అందుకే భాజపాకు అంత తక్కువ సీట్లు వచ్చాయని చెప్పవచ్చు. కనుక ఈ ఫలితాల నేపధ్యంలో భాజపా అధిష్టానం ఒకసారి ఆత్మపరిశీలన చేసు కోవడం మంచిది,” అని అన్నారు. 

నిజానికి గుజరాత్ లో భాజపా సర్కార్ పనితీరుకు కొలమానంగా జరుగవలసిన ఈ ఎన్నికలలు మోడీ సర్కార్ పనితీరుకు కొలమానంగా జరగడమే విచిత్రం. భాజపాకు కంచుకోటవంటి గుజరాత్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర భాజపా నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల శక్తిసామర్ధ్యాలతో ఈ ఎన్నికలను అవలీలగా గెలిచి ఉండాలి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ తన ‘ఇమేజి’ ని పణంగా పెట్టి ప్రచారం చేసినా బొటాబొటి సీట్లతో గట్టెక్కగలిగింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపట్ల గుజరాత్  ప్రజలు చాలా ఆసంతృప్తిగా ఉన్నారనే కదా అర్ధం. కనుక జితేందర్ రెడ్డి సూచిస్తున్నట్లుగా భాజపా అధిష్టానం ఒకసారి ఆత్మపరిశీలన, ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరమే. 


Related Post