ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో మరో గొప్ప ట్విస్ట్!

December 20, 2017


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రిజయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్.కె.నగర్ నియోజకవర్గానికి గురువారం  ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఉపఎన్నికలలో గెలవడం ద్వారా తామే జయలలితకు అసలైన వారసులమని చాటి చెప్పుకొనేందుకు అధికార అన్నాడిఎంకె, శశికళ మేనల్లుడు దినకరన్ వర్గాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఆరునెలలుగా శశికళ వర్గానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నందున ఈ ఉపఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలిచి జయ వారసులమని నిరూపించుకోవడానికి చాలా తహతహలాడుతున్నారు. 

ఆ ప్రయత్నంలోనే ఇన్నాళ్ళుగా తమవద్ద భద్రంగా దాచి ఉంచిన బ్రహ్మాస్త్రాన్ని ఈరోజు బయటకు తీసి తమ ప్రత్యర్దులపైకి ప్రయోగించారు. అదే..జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటుండగా తీసిన ఫోటోలు..వీడియో. రేపు ఉపఎన్నికలు జరుగుతాయనగా నేడు విడుదల చేయడం ద్వారా ప్రజలలో మళ్ళీ అమ్మ సెంటిమెంటు తట్టిలేపే ప్రయత్నం చేసినట్లు భావించవచ్చు. 

జయలలితను శశికళ గట్టిగా కొట్టడం వలననే క్రిందనపడినప్పుడు ఆమె తలకు దెబ్బలు తగిలి అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయారని, ఆ స్థితిలోనే ఆమెను అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారని, అందుకే ఆ తరువాత ఆమెను ఎవరూ చూడకుండా శశికళ అడ్డుకొన్నారని పన్నీర్ సెల్వం మరికొందరు అన్నాడిఎంకె నేతలు ఇంతకాలంగా ఆరోపిస్తున్నారు. 

జయలలిత ఆసుపత్రి ఐసియులో ఉన్నప్పుడు తన మంచం మీద కూర్చొని తాపీగా జ్యూస్ త్రాగుతున్న ఒక ఫోటోను, వీడియోను ఈరోజు దినకరన్ మద్దతుదారుడు పి. వెట్రివేల్‌ ఈరోజు మీడియాకు విడుదల చేశారు. అనివార్య కారణాల వలన తాము ఇంతకాలం ఈ ఫోటోను, వీడియోను విడుదల చేయలేకపోయామని, తమపై వస్తున్న నిరాధారమైన ఆరోపణలకు సమాధానంగానే అమ్మ ఫోటోలను, వీడియోను ఈరోజు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అమ్మ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్ ఇంతవరకు తమకు ఎటువంటి నోటీసులు పంపలేదని, విచారణకు హాజరుకమ్మని కోరలేదని చెప్పారు. ఒకవేళ కమీషన్ ఆదేశిస్తే దాని ముందు విచారణకు హాజరయ్యి తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను సమర్పించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. 

పోలింగ్ కు సరిగ్గా ఒక్కరోజు ముందు దినకరన్ వర్గీయులు తమ నిజాయితీని నిరూపించుకొంటూ ఆధారాలు సమర్పిస్తామని చెప్పడం, అందుకు తగ్గట్లుగా అమ్మ ఫోటోను , వీడియోను బయటపెట్టడం ద్వారా పళని, పన్నీర్ వర్గాలను గట్టి ఎదురుదెబ్బ తీసినట్లే చెప్పవచ్చు. ఈ కారణంగా రేపటి పోలింగ్ లో ఆర్.కె.నగర్ ప్రజలు దినకరన్ కు ఓటేసి గెలిపిస్తే, తమిళనాడు రాజకీయాలు మళ్ళీ మరో మలుపు తిరిగే అవకాశాలున్నాయి. ఈ ఉపఎన్నికలు ఫలితాలు ఈనెల 24న వెలువడతాయి. 


Related Post