అయితే అమ్మ రిటైర్ కాదనేగా అర్ధం?

December 16, 2017


img

ఇవ్వాళ్ళ రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించడంతో సోనియా గాంధీ ఇప్పుడు ఏమి చేస్తారనే సందేహం తలెత్తడం సహజం. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఆమె నిన్ననే చెప్పారు. కానీ ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని కనుక రాజకీయాలలో కొనసాగుతారని ఆ పార్టీ ప్రతినిధి ప్రకటించారు. ప్రస్తుతం ఆమె రాయ్ బరేలీకి లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక ఆ పదవీకాలం ముగిసేవరకు రాజకీయాలలో కొనసాగవచ్చని నిన్ననే చెప్పుకొన్నాము. 

అయితే ఆమె రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని చెప్పిన మాటలనే మీడియాలో ప్రముఖంగా వస్తుండటంతో వాటికి సంజాయిషీలు చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందిపడుతూనే ఉంది. అవి చాలవన్నట్లు కొత్తగా మరో ఊహాగానం మొదలైంది. సోనియా గాంధీ రాజకీయాలనుంచి రిటైర్ అవుతున్నారు కనుక వచ్చే ఎన్నికలలో ఆమె కుమార్తె ప్రియంకా వాద్రా రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని వాటి సారాంశం. కనుక మళ్ళీ వాటిపై ప్రియంకా వాద్రా సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. 

తను, తన తల్లి గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపడేశారు. వచ్చే ఎన్నికలలో రాయ్ బరేలీ నుంచి మళ్ళీ తన తల్లే పోటీ చేస్తారని ఆమె చెప్పారు. అంటే సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారే తప్ప పార్టీ నుంచి, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం అవుతోంది. అయితే సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పిన రెండు మూడు గంటలలోపే కాంగ్రెస్ పార్టీ దానిని ఎందుకు ఖండించవలసి వచ్చింది? అనే అనుమానం కలుగకమానదు. 

ఆమె శాస్వితంగా రాజకీయాల నుంచి తప్పుకొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుందనే భయం కావచ్చు. కనుక రాహుల్ గాంధీ పార్టీపై పూర్తి పట్టు సాధించేవరకు లేదా కనీసం కాస్త నిలద్రొక్కుకొనేవరకు సోనియా గాంధీ రాజకీయాలలో ఉండక తప్పదు. ఎలాగూ రాజకీయాలలో కొనసాగుతున్నప్పుడు లోక్ సభలో కూర్చోవడమే మంచిది. అందుకే ఆమె వచ్చే ఎన్నికలలో రాయ్ బరేలీ నుంచి మళ్ళీ పోటీ చేస్తారని కాంగ్రెస్ చెపుతోందనుకోవలసి ఉంటుంది.     



Related Post