ఇక అయన తెలంగాణాపై దృష్టి పెడతారుట!

December 16, 2017


img

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇక తెలంగాణా రాష్ట్రంపై దృష్టి పెట్టబోతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించేందుకు అమిత్ షా జనవరి నెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చి పార్టీకి దిశానిర్దేశం చేయడానికి రాబోతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే పనిమీద ఫిబ్రవరి నెలలో తెలంగాణాలో పర్యటించబోతున్నారని తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రభావం తెలంగాణా రాష్ట్రంపై కూడా తప్పక ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఏవిధంగా ముందుకు సాగాలో, ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలో, తెరాసను ఏవిధంగా డ్డీకొనాలో వంటి అనేక ముఖ్యమైన విషయాలు చర్చించేందుకు ఈ నెల 19నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర పార్టీ నేతలు అందరూ సమావేశం కాబోతున్నామని అది చాలా కీలక సమావేశమని కె లక్ష్మణ్ అన్నారు.

అమిత్ షా తెలంగాణాలో భాజపాను బలోపేతం చేయడానికి, దానికి దిశానిర్దేశం చేసి ఎన్నికలకు సిద్దం చేయడానికి రాష్ట్రంలో పర్యటించడం తప్పేమీ కాదు. కానీ తెలంగాణా రాష్ట్రంపై గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రభావం తప్పక ఉంటుందని చెప్పుకోవడమే హాస్యాస్పదంగా ఉంది. నిజానికి నిన్న మొన్నటి వరకు గుజరాత్ లో భాజపా, కాంగ్రెస్ పార్టీల మద్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ నెలకొని ఉంది. ఈసారి భాజపా గెలుస్తుందో లేదోననే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ పోలింగ్ పూర్తవగానే వెలువడిన సర్వే అంచనాలలో ఈసారి కూడా భాజపాయే తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారం నిలబెట్టుకొంటుందని చెప్పడంతో భాజపా నేతలకు ఊరట లభించి ఉండవచ్చు. 

కనుక ఆ సర్వే అంచనాలను నమ్ముకొని ఆ రాష్ట్రాల ఫలితాల ప్రభావం తెలంగాణాపై ఉంటుందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఒకవేళ గుజరాత్ లో భాజపా ఓడిపోతే అప్పుడు కూడా ఆ ప్రభావం తెలంగాణా( భాజపా) పై ఉంటుందని లక్ష్మణ్ చెప్పగలరా? అని ఆలోచిస్తే అయన ఈ వ్యాఖ్యలు చేయడం ఎంత తొందరపాటో అర్ధం అవుతుంది.

అయినా గుజరాత్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు.. తెలంగాణాలో ఉన్న పరిస్థితులు వేరు. గుజారాత్ లో భాజపా అధికారంలో ఉండి కూడా ఈ ఎన్నికలలో గెలిచేందుకు చెమటోడ్చవలసి వచ్చింది. ఇక తెలంగాణాలో శక్తివిహీనమైన భాజపా నానాటికీ బలపడుతున్న తెరాసను ఏవిధంగా ఓడించగలదు? కనీసం కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యామ్నాయంగా నిలబడలేని స్థితిలో ఉన్న భాజపా కేవలం మోడీ నామస్మరణతోనే తెలంగాణాలో అధికారంలోకి రావడం సాధ్యమేనా? అని రాష్ట్ర భాజపా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది.

ఇక 19 నుంచి సమావేశాలు నిర్వహించుకొని వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు చర్చించుకొంటున్నామని లక్ష్మణ్ చెప్పారు. బాగానే ఉంది. కానీ అంతకంటే ముందుగా వచ్చే ఎన్నికలలో నిలబెట్టేందుకు భాజపా వద్ద తగినంతమంది ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్దులున్నారా? అని ముందు ఆలోచించుకొంటే మంచిదేమో? 

ఇక నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటించినా అయన ప్రధానమంత్రి హోదాలోనే వస్తారు కనుక అయన పార్టీ కార్యక్రమాలకు ఎంత సమయం కేటాయించగలరు?ఒకపక్క తెరాస సర్కార్ ను, దాని ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరును ప్రశంసిస్తూ, అదే నోటితో మళ్ళీ ఏవిధంగా విమర్శించగలరు?

ఇటీవల అయన జిఈఎస్ సదస్సు ప్రారంభోత్సవాలకు హాజరైనప్పుడు, బేగంపేట విమానాశ్రయ ఆవరణలో భాజపా శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడినప్పుడు, తెలంగాణా విమోచన దినోత్సవం గురించి చాలా ఆచి తూచి నాలుగు ముక్కలు మాట్లాడారు. దానిలో ఎక్కడా తెరాస సర్కార్ ను వేల్లెత్తి చూపలేదు. ఎందుకంటే అయన ప్రధానమంత్రి హోదాలో అధికారిక పర్యటనకు వచ్చారు కనుక. బహుశః ఫిబ్రవరిలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదేజరుగుతుంది. కనుక ప్రధాని రాష్ట్ర పర్యటన వలన రాష్ట్ర భాజపాకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అంటే అనుమానమే. 

కనుక భాజపా ముందుగా చేయవలసిన పనులు రెండున్నాయి. తెరాసతో దోస్తీ చేయాలా లేక యుద్దానికి సిద్దపడాలా? అనే విషయంపై స్పష్టత సాధించడం. యుద్దానికే సిద్దం అనుకొంటే వచ్చే ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ పార్టీలను డ్డీ కొని నిలువగల బలమైన అభ్యర్ధులను సిద్దం చేసుకోవడం. అప్పుడు వ్యూహాల గురించి ఆలోచించితే ఏదైనా ప్రయోజనం ఉంటుంది.  



Related Post