గురువుకి కెసిఆర్ పాదాభివందనం

December 16, 2017


img

దేశానికి రాజైనా ఒక తల్లికి బిడ్డేనని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపిస్తుంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒక గురువుకు శిష్యుడేనని కెసిఆర్ నిరూపించి చూపారు. తనకు చిన్నప్పుడు విద్యనేర్పిన గురువుగారు శ్రీ మృత్యుంజయ శర్మను  హైదరాబాద్ లో నిన్నటి నుంచి మొదలైన ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించి, ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించిన తరువాత పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకొన్నారు. అది చూసి అందరూ చాలా మురిసిపోయారు. ప్రతిపక్ష నేతలను తన మాటలతో చీల్చి చెండాడే కెసిఆర్, తనకు విద్యనేర్పిన గురువు ముందు మోకరిల్లి పాదాభివందనం చేయడం అయనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. 

కొన్ని రోజుల క్రితం సిద్ధిపేటలో ప్రభుత్వ కార్యక్రమాలకు వెళుతున్నప్పుడు దారిలో ములుగు గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన తన చిన్ననాటి మిత్రులు అంజిరెడ్డి, జహంగీర్ నిలబడి ఉండటం గమనించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తన కాన్వాయ్ ని ఆపించి వారిని కూడా తన వాహనంలో ఎక్కించుకొని తనతో తీసుకువెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కెసిఆర్ తనకు విద్య నేర్పిన గురువులను, చిన్ననాటి స్నేహితులను, పుట్టి పెరిగిన ఊరును అక్కడి ప్రజలను ఏనాడూ మరిచిపోలేదు. వారిపట్ల అవ్యాజ్యమైన ప్రేమను, గౌరవాన్ని కనబరుస్తూనే ఉన్నారు.

రాజకీయ నాయకులలలో...ముఖ్యంగా అధికారంలో ఉన్నవారిలో చాలా అరుదుగా ఇటువంటి గొప్ప లక్షణం కనిపిస్తుంది. అందుకే ఆయన మిగిలిన వారి కంటే ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు. తెరాస నేతలతో సహా అందరూ ఆయనలో ఈ గొప్ప లక్షణాలను ఆదర్శంగా స్వీకరించి ఆచరిస్తే బాగుంటుంది. 


Related Post