పార్టీ మారారంటే అర్ధం అదే కదా?

December 15, 2017


img

తెదేపా మాజీ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డి ఇద్దరూ గురువారం తెరాసలో చేరిన సందర్భంగా వారి గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. తెలంగాణా అభివృద్ధిలో ఈవిధంగా అందరూ భాగస్వాములు కావడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఆమె తన చెల్లెలు వంటిదని, కనుక ఆమె పార్టీలోకి వస్తుంటే తోబుట్టువు వచ్చినట్లుందని అన్నారు. ఏ షరతులు, కోరికలు వెలిబుచ్చకుండా పార్టీలో చేరడం ఆమె సంస్కారానికి నిదర్శనమని అన్నారు. ఆమె కుమారుడు సందీప్ రెడ్డికి మంచి రాజకీయ అవగాహన ఉందని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు. కానీ వారిరువురికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఆమె తెదేపాకు రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడుకు వ్రాసిన లేఖలో తనకు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు, సముచిత గౌరవం ఇచ్చి చాలా ప్రోత్సహించారని కానీ రాజకీయ కారణాల చేత బాధతో పార్టీని విడిచిపెడుతున్నానని వ్రాశారు. ‘రాజకీయ కారాణాలు’ అంటే తమ ఇద్దరి ‘రాజకీయ భవిష్యత్’ కోసమేనని అర్ధం అవుతూనే ఉంది. 

నిజానికి ఏ రాజకీయ నాయకుడు కూడా తనకు లాభం లేనిదే పార్టీ మారడని అందరికీ తెలుసు. ఉమామాధవ్ రెడ్డి, ఆమె కుమారుడు కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక టికెట్ ప్రస్తావన చేయలేదు కానీ వచ్చే ఎన్నికలలో తన కొడుకుకు తప్పకుండా తెరాస టికెట్ వస్తుందనే నమ్మకంతోనే ఆమె పార్టీలో చేరారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వారికి హామీ ఇచ్చినట్లే మాట్లాడారు. 

ఒకవేళ ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోతే రాజకీయ నాయకులు ఏవిధంగా వ్యవహరిస్తారో తెలుసుకోవాలంటే తెరాసలోనే ఎమ్మెల్సీ ఆర్. భూపతిరెడ్డి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తున్నారు. కనుక ఉమామాధవ్ రెడ్డి ఊసుపోకనో లేదా తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసమో తెరాసలో చేరారనుకోలేము. 

ఇక ‘తెరాసలో చేరడం అంటే అభివృద్ధిలో భాగస్వాములు అవడం’ అనే మాటలు వినడానికి చాలా బాగుంటాయి కానీ ‘తెరాసలో చేరినవారు మాత్రమే తెలంగాణా అభివృద్ధిని కోరుకొంటారు మిగిలినవారందరూ అభివృద్ధి నిరోధకులు’ అనే సిద్దాంతం చాలా వికృతంగా ఉంది. 

ఇతర పార్టీల నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం ద్వారా వాటిని చావుదెబ్బ తీసి తెలంగాణాలో తెరాస తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ‘బంగారి తెలంగాణా సాధన కోసం రాజకీయ పునరేకీకరణ’ అని చెప్పుకోవడం చమత్కారమే కదా. 


Related Post