మహాసభలలో ఎన్టీఆర్ కు స్థానం లేదా?

December 15, 2017


img

నేటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు కొంతమందిని పనిగట్టుకొని ఆహ్వానించడం, మరికొంత మందిని ఆహ్వానించకపోవడంపై ఇప్పటికే పలువురు తెరాస సర్కార్ తీరును తప్పు పడుతున్నారు. ఈ మహాసభలలో తెలంగాణా రాష్ట్రానికే చెందిన అనేకమంది ప్రముఖ కవులను ఆహ్వానించనందుకు కాంగ్రెస్, వామపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలను కూడా తెరాస సర్కార్ రాజకీయ కోణంలో నుంచే చూస్తూ నిర్వహించాలనుకోవడాన్ని వారు తప్పు పట్టారు.

తెలుగు బాష, తెలుగుదనం గురించి చెప్పుకోవాలంటే ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ గురించి చెప్పుకోకతప్పదు. సినీ, రాజకీయ రంగాలలో అసమాన కీర్తి ప్రతిష్టలు స్వంతం చేసుకొన్న ఆయనకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో స్థానం కల్పించకపోవడంపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహాసభలలో ఎక్కడా కనీసం ఆయన ఫొటోను పెట్టనందుకు నిరసన వ్యక్తం చేస్తూ విజయవాడ వద్ద గరికపాడు ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమానులు గుండు గీయించుకొన్నారు. ఈ మహాసభలకు సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించనందుకు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.    

తెలుగు బాషకు తెలుగు సినిమాలకు అవినాభావ సంబంధం ఉందనే సంగతి అందరికీ తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, రేలంగి, పద్మనాభం, సావిత్రి, జమున, సూర్యాకాంతం మొదలు సత్యనారాయణ, కృష్ణ, చిరంజీవి వంటి అనేకానేక మహానటీనటులున్నారు. అలాగే ఆరుద్ర, దేవులపల్లి, వేటూరి వంటి అనేకానేకమంది గీత రచయితలున్నారు. ఇక దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, ఇతర కళాకారులకు లెక్కే లేదు. సినీ పరిశ్రమలో ఆనాటి నుంచి ఈనాటి వరకు వివిధ శాఖలకు చెందిన ఉద్దండులైనవారు అనేకమంది ఉన్నారు. వారిలో ఎంతమంది పేర్లు ఈ మహాసభలలో ప్రస్తావనకోస్తాయో చూడాలి.

అదే విధంగా ఆంధ్రాకు చెందిన అనేకమంది సుప్రసిద్ధ రచయితలు, కవులు, కళాకారులు ఉన్నారు. అనేక అమూల్యమైన రచనలు, గ్రంధాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నవి ప్రపంచ తెలుగు మహాసభలు కనుక తెలుగు బాషతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ అందులో సముచిత ప్రాధాన్యం, గౌరవం, గుర్తింపు లభించాలని కోరుకోవడం అత్యాశ కాదు. కనుక తెరాస సర్కార్ రాజకీయాలకు అతీతంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తుందని ఆశిద్దాం. 


Related Post