తెలంగాణాలో ఆ 3 జిల్లాలకే కేంద్రం సాయం?

December 15, 2017


img

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ ప్రకారమే తెలంగాణాలో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల అభివృద్ధికి ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున తొమ్మిది జిల్లాలకు రూ.450 కోట్లు విడుదల చేసింది. అయితే ఆ తరువాత నిధుల విడుదలలో జాప్యం చేస్తునందున వాటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంపిలు, అధికారులు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కానీ ఫలితం కనబడటం లేదు. ఆంద్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. 

ఈ నేపధ్యంలో కేంద్రం చేసిన తాజా ప్రతిపాదన అనుమానాలు రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 115 వెనుకబడిన జిల్లాలు ఉన్నట్లు గుర్తించింది. వాటి సమగ్రాభివ్రుద్ధికి ప్రత్యేకంగా అధికారులు, వ్యవస్థలు, నిధులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణా రాష్ట్రంలో 9 వెనుకబడిన జిల్లాలు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీమ అసిఫాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే వెనుకబడినట్లు గుర్తించడమే అనుమానాలు రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఈ మూడు జిల్లాల అభివృద్ధికి ఐ.ఏ.ఎస్. అధికారులు నవీన్ మిట్టల్, అశోక్ కుమార్, నదీం అహ్మద్ లను నోడల్ అధికారులుగా నియమించింది. వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ఆ మూడు జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తారు. 

ఆ మూడు జిల్లాలు రాష్ట్రంలో బాగా వెనుకబడిన జిల్లాలనే దానిలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే, కేంద్రప్రభుత్వం ఇప్పుడు వాటికి మాత్రమే నిధులు అందిస్తుందా లేక ఇదివరకు గుర్తించిన 9 వెనుకబడిన జిల్లాలతొ బాటు కొత్తగా గుర్తించి ఈ మూడు జిల్లాలకు కూడా అధనంగా నిధులు అందిస్తుందా? అనే విషయంపై స్పష్టత రావలసి ఉంది. 

ఎందుకంటే 9 జిల్లాలకు విడుదల చేయవలసిన నిధులే సకాలంలో విడుదలచేయనప్పుడు, మళ్ళీ అధనంగా మరో మూడు జిల్లాలకు నిధులు విడుదల చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. కనుక ఆర్ధిక భారం తగ్గించుకోవడం కోసమే కేంద్రం ఈ ప్రతిపాదన చేస్తోందా? అనే అనుమానం కలుగుతోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వమైనా దీనిపై స్పష్టత ఇస్తే బాగుంటుంది.  


Related Post