ఇన్నాళ్ళకు బాబు ఘనతను అంగీకరించారు

December 15, 2017


img

చారిత్రిక ప్రాధాన్యం గల హైదరాబాద్ నగరానికి అత్యాధునిక ఐటి సొబగులు అద్ది, ఐటి కేంద్రంగా మలిచి నగరానికి కొత్త గుర్తింపు తెచ్చిన ఘనత ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని అందరికీ తెలిసిందే. అయితే తెదేపాతో తెరాసకున్న రాజకీయ విభేధాల కారణంగా తెలంగాణా ప్రభుత్వం దానిని గుర్తించడానికి, అంగీకరించడానికి ఇష్టపడలేదు. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఐటి శాఖమంత్రి కేటిఆర్ ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడిదేనని బహిరంగంగా చెప్పడం అయనను ప్రశంసించడం చాలా అభినందనీయం.              

టెక్ మహీంద్రలో నిన్న జరిగిన మిషన్ ఇన్నోవేషన్-2018 కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో ఐటి రంగం అభివృద్ధికి మూలకారకుడు చంద్రబాబు నాయుడే. ఆనాడు అయన అమెరికా వెళ్ళి బిల్ గేట్స్ ను కలిసి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించడానికి ఒప్పించారు. చంద్రబాబు నాయుడు హయంలోనే ప్రపంచంలో టాప్-5 ఐటి కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయి. ఐటి రంగం అభివృద్ధికి అయన చాలా కృషి చేశారు కనుకనే నేడు హైదరాబాద్ ఐటి రంగంలో గుర్తింపు వచ్చింది. కనుక ఈ క్రెడిట్ ఆయనకే చెందుతుంది,” అని అన్నారు.

తెదేపా, తెరాసల మద్య, రెండు ప్రభుత్వాల మధ్య విభేదాలు, వివాదాలు ఉన్నప్పటికీ ఒకరి గొప్పదనాన్ని మరొకరు ఈవిధంగా గుర్తించి గౌరవించుకొంటే ఇరు రాష్ట్రాల మద్య సంబంధాలు వాటంతట అవే బాగుపడతాయి. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు కెసిఆర్ ను ఆహ్వానించగా, ఆయనుత చండీయాగానికి కెసిఆర్ చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఆ తరువాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు ఏవిధంగా మెరుగుపడ్డాయో అందరూ కళ్ళారా చూశారు. కనుక రెండు రాజకీయ పార్టీల రాజకీయ విభేధాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు..ప్రభుత్వాలు..ప్రజలు కూడా శత్రువులుగా మెలగడం సరికాదు. పరస్పరం గౌరవించుకొంటూ       సహకరించుకొంటూ ముందుకు సాగడమే మంచిది. 


Related Post